కరోనా వ్యాక్సినేషన్: కోర్టు జోక్యం తగదట.. అంతా వాళ్ళిష్టమేనట.!

దేశంలో కరోనా వ్యాక్సినేషన్.. ఎవరికీ అర్థం కాని ఓ ప్రసహనంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జరుగుతున్నమాట వాస్తవం. కానీ, చాలా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ సజావుగా సాగడంలేదు. మొదటి డోస్ అందుకున్నవారికి, రెండో డోస్ అందడంలేదు.. అసలిప్పుడు మొదటి డోస్ వ్యాక్సిన్ కూడా అందని పరిస్థితి. ఇదంతా 45 ఏళ్ళ పైబడిన వయసువారికి సంబంధించిన అంశం.

18 నుంచి 45 ఏళ్ళ మధ్యవారికి వ్యాక్సినేషన్ ‘మమ’ అన్నట్లుగా ప్రారంభమయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ గ్రూపువారికి వ్యాక్సినేషన్ అస్సలు అందడంలేదు. ఇంకోపక్క, కేంద్రానికి వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఒక రేటుకి వ్యాక్సిన్లను అందిస్తాయి.. రాష్ట్రాలకి మరో రేటు.. సాధారణ ప్రజలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ వేయించుకోవాలంటే మరో ధర. ఇదేంటిది.? అని ఎవరన్నా ప్రశ్నిస్తే, ‘అంతా మా ఇష్టం’ అంటోంది కేంద్రం.

ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. సుమోటోగా కేసు విచారణ చేపట్టింది. దాంతో, కేంద్రానికి ఒళ్ళు మండినట్లుంది. వ్యాక్సినేషన్.. అనేది విధానపరమైన నిర్ణయం అనీ, ఈ విషయంలో కోర్టు జోక్యం తగదనీ, అఫిడవిట్ దాఖలు చేసేశారు. ప్రైవేటు వ్యాక్సిన్ తయారీదారులకు ప్రోత్సాహక డిమాండ్ కల్పించే పద్ధతిలో భాగంగానే టీకా ధరల్లో వ్యత్యాసాలు వున్నాయన్నది కేంద్రం వాదన.

దీంతో ఉత్పత్తి పెరగడంతోపాటు, విదేశీ తయారీదారులు కూడా దేశంలో వచ్చేందుకు ఆసక్తి చూపుతారట. తద్వారా వ్యాక్సిన్ల లభ్యత పెంచవచ్చట. ఇదీ కేంద్రం తీరు. రెండు వ్యాక్సిన్లున్నాయి.. రెండూ ఒకే తరహా సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. మరి, ధర విషయంలో ఎందుకంత తేడా.? మరీ రెట్టింపు తేడా ఎలా వస్తుందబ్బా.? దీన్ని ఏ తరహా రాజకీయం అనుకోవాలో అర్థం కాని పరిస్థితి. ప్రైవేటుగా టీకాలు అమ్ముకునే వెసులుబాటు ఆయా సంస్థలకు కేంద్రం ఇచ్చాకనే, దేశంలో కరోనా వ్యాక్సిన్ లభ్యత తగ్గిపోయింది. దీన్నేమనాలి చెప్మా.? మోడీ మార్కు మాయ.. అనాలేమో.