దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ డెబ్యూ లుక్

పరిశ్రమలో నటవారసత్వం (నెపోటిజం) అన్నివేళలా చర్చనీయాంశమే. హీరోల వారసులు హీరోలు.. నిర్మాతలు దర్శకుల వారసులు హీరోలే. చివరికి క్యారెక్టర్ ఆర్టిస్టులు విలన్ల వారసులు కూడా హీరోలుగా పరిచయం అవుతున్నారు. ఈ ట్రెండ్ అనాదిగా కొనసాగుతోంది. ఇకపోతే నెప్టోయిజం బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ లో పరిమితం. ఇక్కడ ట్యాలెంట్ తో ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలు ఉన్నారు. ప్రతిభ ఉంటే అవకాశాలిచ్చేందుకు అగ్ర నిర్మాతలు వెనకాడడం లేదు.

ఇకపోతే టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కుటుంబం నుంచి ఒక హీరో ఇప్పుడు పరిశ్రమలో ప్రవేశిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. అతడి పేరు ఆశిష్. దిల్ రాజుకు మేనల్లుడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ `రౌడీ బాయ్స్` లో అతడు నటిస్తున్నాడు. తాజాగా ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్ లో ఆశిష్ హీరోయిక్ లుక్ ఆకట్టుకుంటోంది. మంచి ఆకర్షణీయమైన రూపాన్ని అతడు కలిగి ఉన్నాడు.

తన ఏజ్ కి తగ్గట్టే `రౌడీ బాయ్స్` ఒక అందమైన కాలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ అని తెలిసింది. విద్యార్థుల నడుమ వివాదాలు పోరాటాలతో ట్రెండీగా సాగనుంది. క్యాంపస్ డ్రామా అనగానే 90లలో వచ్చిన ప్రేమదేశం – చెలి లాంటి క్లాసిక్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఆశిష్ ను మరీ ఆ రేంజులో ఇంట్రడ్యూస్ చేస్తున్నారా? అన్నది కాస్త ఆగితే కానీ తెలీదు.

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ హర్ష కనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. టాప్ కెమెరామెన్ మాది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రౌడీ బాయ్స్ ని దిల్ రాజు- శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ లో మూవీని విడుదల చేస్తారని సమాచారం.