మద్రాస్ హైకోర్టులో శంకర్ కు ఊరట

ఇండియన్ 2 వివాదంలో కోర్టు మెట్లెక్కిన లైకా ప్రొడక్షన్స్ కు చుక్కెదురైంది. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 కరోనాకు ముందే హోల్డ్ లో పడింది. అప్పటినుండి ఇంకా ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కలేదు. అయితే శంకర్ మాత్రం తన తర్వాతి సినిమా షూటింగ్ కు సన్నద్ధమవుతున్నాడు.

ఈ విషయంలో లైకా ప్రొడక్షన్స్ కోర్టులో ప్రశ్నించింది. 150 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించాలి అనుకున్నామని ఇప్పటికే 236 కోట్ల రూపాయలు ఖర్చైనా కానీ 80 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయిందని, శంకర్ కు 40 కోట్ల రూపాయలు పారితోషికం డీల్ మాట్లాడుకుంటే 14 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చామని చెప్పుకొచ్చారు.

అయితే ఈ విషయంపై మద్రాస్ హైకోర్టు తన వైఖరిని స్పష్టం చేసింది. శంకర్ ను వేరే సినిమాలు చేయకుండా నిషేధం విధించలేమని తెలిపింది. అలాగే శంకర్ ను ఈ విషయమై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసారు. తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేశారు.