ధూళిపాళ్ల కు బెయిల్ మంజూరు

తెలుగు దేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇటీవల సంఘం డెయిరీ కేసులో అరెస్ట్‌ అయిన విషయం తెల్సిందే. సంఘం డెయిరీ నిధులను అక్రమంగా వినియోగించారంటూ.. దారి మల్లించారంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ అయిన ధూళిపాళ్ల బెయిల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఎట్టకేలకు ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

షరతులతో కూడిన బెయిల్‌ ను ధూళిపాళ్లకు ఇవ్వడం జరిగింది. నాలుగు వారాల పాటు విజయవాడ మున్సిపల్‌ పరిధిలోనే ఉండాలని అలాగే ప్రస్తుతం నివాసం ఉంటున్న చిరునామాను విచారణ అధికారులకు ఇవ్వాలంటూ న్యాయ స్థానం ఆదేశించింది. ఇక విచారణకు విధిగా హాజరు కావాలంటూ ఆదేశించడంతో పాటు అధికారులకు విచారణ కోసం 24 గంటల ముందుగానే నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. బెయిల్ మంజూరు అవ్వడంతో ధూళిపాళ్ల విడుదల అవ్వబోతున్నాడు. ఆయనతో పాటు సంఘం డెయిరీ ఎండీ గోపాలకృష్ణ కు కూడా బెయిల్‌ మంజూరు అయ్యింది.