భూ వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణలపై మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన ఈటలను పార్టీ నుంచి సాగనంపే ప్రయత్నాలు కూడా ముమ్మరమయ్యాయి. అయితే, నేరుగా బహిష్కరించకుండా తనంతట తానుగానే పార్టీ నుంచి వెళ్లిపోయేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బాధ్యతను మంత్రి గంగుల కమలాకర్ కు అప్పగించినట్టు సమాచారం. ఈటలతోపాటు ఎవరూ వెళ్లకుండా ఆయన్ను ఒంటరి చేయడంతోపాటు పార్టీ నుంచి ఈటలను బయటకు పంపే కసరత్తు సాగుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈటలపై గంగుల ఇప్పటికే పలుమార్లు విమర్శనాస్త్రాలు సంధించారు. దీనిపై ఈటల కూడా గట్టిగానే స్పందించారు. బిడ్డా.. గంగులా గుర్తుపెట్టుకో.. ఎవరూ వెయ్యేళ్లు బతకరు.. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు అని హెచ్చరించారు.
కరీంనగర్ సంపద విధ్వంసం చేశావని, కరీంనగర్ ను బొందలగడ్డగా మార్చావని, నీ పదవి పైరవీ వల్ల వచ్చిందని మండిపడ్డారు. ‘నీ కల్చర్ నాకు తెలుసు. నీ బెదిరింపులకు భయపడను. నా ప్రజలు నిన్ను పాతిపెడతారు. ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు ఒక్కరోజైనా ఇక్కడి ప్రజల బాధను పంచుకున్నవారా? ఇక్కడ ఎవరి గెలుపులోనైనా సరే మీరు సాయం చేశారా? నాపై తోడేళ్లలా దాడులు చేస్తున్నారు. మంత్రిగా సభ్యత, సంస్కారం ఉండాలి’ అని హితవు పలికారు. దీనిపై గంగుల కూడా తీవ్రంగా స్పందించారు. నా వెంట్రుక కూడా పీకలేవు అంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ఈటలకు ఆత్మగౌరవం ఉంటే ఆక్రమించిన భూములను వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు.