కుట్రలకు భయపడేది లేదు: ఈటల సతీమణి జమున

‘మా గోదాములు ఖాళీ చేయించి ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. అసత్య ప్రచారాలు ఎక్కువ రోజులు నిలవవు. ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదు’ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య జమున స్పష్టంచేశారు. హైదరాబాద్ శామీర్ పేటలోని తమ నివాసంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు.

జమున హేచరీస్, గోదాములపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇవి ఎంతోకాలం నిలవబోవని పేర్కొన్నారు. తాము కష్టపడి పైకొచ్చామని, ఎవరినీ మోసం చేయలేదని, కానీ పోలీసులు తమను ప్రణాళిక ప్రకారం భయభ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. మెదక్ జిల్లా మాసాయిపేటలో 46 ఎకరాలు కొనుగోలు చేశామని, అంతకుమించి ఒక్క ఎకరం ఎక్కువగా ఉన్నా ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశారు. ఒకవేళ లేకుంటే సర్వే చేసిన అధికారులు ముక్కు నేలకు రాస్తారా అని ప్రశ్నించారు.

తమ స్థలంలో ఏర్పాటు చేసిన పత్రికలోనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 1992లో దేవరయాంజాల్ వచ్చి 1994లో అక్కడ భూములు కొనుగోలుచేశామని చెప్పారు. తాము ఎవరికీ అన్యాయం చేయలేదని, దోపిడీ చేయలేదని పేర్కొన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, ధర్మమే నిలబడుతుందని వ్యాఖ్యానించారు.

భూముల్లో సర్వే చేయొద్దని తాము చెప్పలేదని.. తమ సమక్షంలో చేయాలని మాత్రమే కోరామని వివరణ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమపై ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయని.. ఉద్యమం వదిలి వైఎస్ వెంట నడవాలని అప్పటి మంత్రి రత్నాకర్ రావు చెప్పారని.. కానీ తాము వెళ్లలేదని వెల్లడించారు. సమైక్య పాలనలో కులాలు చూడలేదని.. కానీ ఇప్పుడు కులాలతో విభజిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పౌల్ట్రీ అమ్ముకుని మరీ ఉద్యమం కోసం ఖర్చు చేసినట్టు జమున చెప్పారు.