దర్శకుడిగా మారబోతున్న మరో ఫైట్‌ మాస్టర్‌

డాన్స్‌ మాస్టర్ లు మరియు ఫైట్ మాస్టర్‌ లు చాలా మంది దర్శకులుగా మారడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలా మంది కొరియోగ్రాఫర్ లు దర్శకులుగా మారి టాప్ డైరెక్టర్స్ గా కూడా పేరు దక్కించుకున్నారు. అలాంటి వారి జాబితాలో మరో ఫైట్‌ మాస్టర్ కమ్ యాక్టర్‌ సెల్వ దర్శకుడిగా పరిచయం అయ్యేందుకు సిద్దం అవుతున్నాడు. తెలుగులో చాలా సినిమాల్లో తెర వెనుక యాక్షన్‌ సన్నివేశాలను కంపోజ్‌ చేయడంతో పాటు తెరపై కూడా కనిపించి విలన్ గా మెప్పించాడు. అలాంటి సెల్వ ఇప్పుడు దర్శకుడిగా మారబోతున్నాడు.

సెల్వ ఇప్పటి వరకు వంద సినిమాలకు పైగా నటించాడు. ఒక్క తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళం, కన్నడం, మలయాళం ఇలా అన్ని భాషల్లో కూడా నటించాడు. పలు సినిమాలకు కొరియోగ్రాఫర్‌ గా వ్యవహరించిన సెల్వ దర్శకుడిగా ఒక తమిళ, తెలుగు భాషల సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాకు ఏఎల్ విజయ్‌ కథ మరియు స్క్రీన్‌ ప్లే అందించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.