జార్జిరెడ్డి స్టార్ ‘గంధర్వ’

పూరి మూవీ లోఫర్ లో చిన్న పాత్రలో కనిపించి ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ‘వంగవీటి’ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న సందీప్ మాధవ్ 2019 లో వచ్చిన జార్జి రెడ్డితో మరింతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. నిజంగా జార్జిరెడ్డి ఇలాగే ఉండేవాడేమో అన్నట్లుగా ఆ సినిమాలో సందీప్ లుక్ మరియు నటన ఉంది. అన్ని విధాలుగా ఆ సినిమాలో సందీప్ మాధవ్ ఆకట్టుకున్నాడు. ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చినా కూడా కథ ల ఎంపిక విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ఎట్టకేలకు ‘గంధర్వ’ అనే సినిమాకు ఓకే చెప్పాడు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా సందీప్ గంధర్వ లుక్ ను రివీల్ చేశారు. అప్సర్ దర్శకత్వంలో ఎంఎన్ మధు నిర్మిస్తున్నాడు. షూటింగ్ చక చక జరుగుతుందని.. ఈ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ను త్వరలోనే థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. జార్జిరెడ్డి సినిమాలో యాంగ్రీ యంగ్ మన్ పాత్రలో కనిపించిన సందీప్ యాక్షన్ సినిమాలకు బాగా సెట్ అవుతాడనే నమ్మకంను ప్రేక్షకులు మరియు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

గంధర్వ సినిమా తో మరోసారి సందీప్ మాధవ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఆ తర్వాత ఫుల్ బిజీ అవ్వడం ఖాయం. హీరోగానే కాకుండా పలు సినిమాల్లో నటించేందుకు గాను సందీప్ కు ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. కాని ప్రస్తుతానికి సందీప్ హీరోగా గంధర్వ సినిమాను చేసే పనిలో బిజీగా ఉన్నాడు. నటుడిగా ఇప్పటికే మంచి మార్కులు దక్కించుకున్న సందీప్ ఇక ముందు ముందు కమర్షియల్ హీరోగా పేరు దక్కించుకోవాల్సి ఉంది. గంధర్వ టైటిల్ విభిన్నంగా ఉండటంతో పాటు మొదటి పోస్టర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండటం వల్ల ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.