సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్ బాబు అన్న, హీరో, నిర్మాత ఘట్టమనేని రమేశ్‌బాబు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై ప్రముఖ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
‘నటుడు, నిర్మాత శ్రీ ఘట్టమనేని రమేశ్ బాబు కన్ను మూశారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రముఖ నటులు శ్రీ కృష్ణ గారి నట వారసత్వాన్ని కొనసాగించి అనంతరం చిత్ర నిర్మాణంలో విజయాలు అందుకున్నారు. సోదరుడు మహేశ్ తో అర్జున్ సినిమా నిర్మించారు. శ్రీ కృష్ణ గారు పుత్రశోకాన్ని దిగమింగుకోవాల్సిన క్లిష్ట సమయమిది. ఆయనకు, కుటుంబ సభ్యులకు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. శ్రీ రమేశ్ బాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు.