హరీష్ శంకర్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారా?

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారా? అంటే టాలీవుడ్ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. వివరాల్లో కి వెళితే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన హరీష్ శంకర్ చాలా ఏళ్ల విరామం తరువాత మరో సారి ఆయనతో కలిసి ‘భవదీయుడు భగత్ సింగ్’ పేరుతో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని చేయబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించారు కూడా. మైత్రీ మూవీమేకర్స్ ఈ మూవీని నిర్మించబోతున్నాయి.

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనుల్లో దర్శకుడు హరీష్ శంకర్ బిజీగా వున్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఫిక్షనల్ పిరియాడిక్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ పూర్తి కాగానే ఓ రీమేక్ మూవీతో పాటు హరీష్ శంకర్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. ఇదిలా వుంటే హరీష్ శంకర్ కు గోల్డెన్ ఆఫర్ దక్కినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

‘భవదీయుడు భగత్ సింగ్’ని తెరకెక్కించబోతున్న హరీష్ శంకర్ కు తాజాగా మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ లభించిందని తెలుస్తోంది. ప్రస్తుతం వరుసగా రీమేక్ చిత్రాలపై దృష్టిపెట్టిన మెగాస్టార్ తా.ఆగా మరో మలయాళ రీమేక్ ని చేయడానికి ఆసక్తిగా వున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంలో మోహన్ లాల్ పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో డాడీ’. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

మీనా కల్యాణీ ప్రియదర్శన్ ఉన్ని ముకుందన్ నిఖిలా విమల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ థియేటర్లలో కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జనవరి 26న విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తండ్రీ కొడుకుల కథగా రూపొందిన ఈ చిత్రంలో మోహన్ లాల్ తండ్రిగా పృథ్వీరాజ్ సుకుమారన్ తనయుడిగా నటించారు. దీన్ని తెలుగులో మార్పులు చేసి రీమేక్ చేయాలని చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు. ఈ రీమేక్ బాధ్యతల్ని హరీష్ శంకర్ కి చిరు అప్పగిస్తున్నారట.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలిసింది. చిరు ప్రస్తుతం బ్లాక్ టు బ్యాక్ రెండు రీమేక్ చిత్రాల్లో నటిస్తున్నారు.

మలయాళ హిట్ లూసీఫర్ ఆధారంగా రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’ ఒకటి కాగా తమిళ హిట్ ఫిల్మ్ ‘వేదాలం’ ఆధారంగా రూపొందుతున్న ‘భోళా శంకర్’ మరొకటి. ఇదిలా వుంటే కొరటాల శివతో చేసిన ‘ఆచార్య’ ఏప్రిల్ లో విడుదల కాబోతోంది.