డ్రగ్స్ కేసు ఎఫెక్ట్: దీపికాతో సంబంధాలు తెంచుకున్న మేనేజర్ కరిష్మా..!


బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్టార్ హీరోయిన్ దీపికా పడుకునే తో పాటు ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాష్ ని కూడా విచారించిన సంగతి తెలిసిందే. క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ తరపున వర్క్ చేసిన కరిష్మా ప్రకాష్.. దీపికాకు మేనేజర్ గా వ్యవరిస్తూ వచ్చారు. అయితే ఆమె క్వాన్ టాలెంట్ మేనేజ్ మెంట్ సంస్థకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయంపై క్వాన్ సంస్థ సీఈఓ విజయ్ సుబ్రమణ్యం స్పందిస్తూ కరిష్మా ప్రకాష్ రాజీనామా చేసింది నిజమేనని.. దాన్ని వెంటనే ఆమోదించామని వెల్లడించారు. గత నెల 21 తేదీన కరిష్మా రాజీనామా చేసిందని.. తమ సంస్థతో సంబంధం ఉన్న మరే ఆర్టిస్టుతో ఆమెకు లింక్స్ ఉండవని.. డ్రగ్స్ కేసులో కరిష్మాపై ఎన్సీబీ చేస్తున్న దర్యాప్తు ఆమె వ్యక్తిగతమని పేర్కొన్నారు. దీంతో దీపికా పడుకునే తో ఇకపై కరిష్మా కు ఎలాంటి లింక్స్ ఉండబోవని తెలుస్తోంది.

కాగా బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసుని విచారిస్తున్న క్రమంలో అనూహ్యంగా డ్రగ్స్ కోణం బయటకు వచ్చింది. ఈ కేసుపై ఫోకస్ పెట్టిన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో.. హీరోయిన్ రియా చక్రవర్తి ని అరెస్ట్ చేయడంతో పాటు క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ మేనేజర్స్ ని విచారించింది. ఈ నేపథ్యంలో దీపికా పదుకొనేని కూడా ఎన్సీబీ ప్రశ్నించింది. 2017 అక్టోబర్ 28న దీపికా తన మేనేజర్ కరిష్మా ప్రకాష్ మరియు టాలెంట్ మేనేజర్ జయ సాహా లతో వాట్సాప్ ఛాట్ లో ‘మాల్’ ‘హ్యాష్’ ‘వీడ్’ గురించి డిస్కస్ చేసినట్లు బయటపడటంతో ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. అయితే కోడ్ భాషలో ‘మాల్’ అంటే సిగరెట్స్ అని.. ‘హ్యాష్’ అంటే స్లిమ్ సిగరెట్స్ అని.. ‘వీడ్’ అంటే మందపాటి సిగరెట్స్ అని వారు సమాధానం చెప్పినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉండగా కరిష్మా ప్రకాష్ నివాసంలో ఎన్సీబీ అధికారులు ఈ మధ్య సోదాలు నిర్వహించారు. ముంబై వెర్సోవాలోని కరిష్మా ఇంట్లో నిర్వహించిన దాడులలో 1.7 గ్రాముల నిషేధిత మాదక ద్రవ్యాలు మరియు రెండు సీసాల సీబీడీ ఆయిల్ లభించినట్లు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో డ్రగ్స్ కేసులో మరోసారి ఎన్సీబీ విచారణకు హాజరుకావాలని కరిష్మా కు సమన్లు జారీ చేశారు. అయితే దాడుల తర్వాత కరిష్మా జాడ కనబడకపోవడంతో అనుమానాలను కలిగిస్తోంది. ఇప్పటివరకు ఆమెకు ఎన్సీబీ మూడు సార్లు నోటీసులు జారీ చేసారని తెలుస్తోంది. అయినా సరే కరిష్మా ప్రకాష్ విచారణకు హాజరు కాలేదని.. ఆమె మొబైల్ స్విచాఫ్ లో ఉందని.. మెయిల్ కు కూడా స్పందించడం లేదని ఎన్సీబీ వర్గాలు వెల్లడించినట్లు నేషనల్ మీడియా తెలిపింది. డ్రగ్స్ కేసు నేపథ్యంలోనే క్వాన్ కి కరిష్మా రాజీనామా చేసి ఉంటదని బీ టౌన్ వర్గాలు అంటున్నాయి.