మంత్రిపై బాంబు దాడి.. తీవ్ర గాయాలు

పశ్చిమ బెంగాల్‌ కార్మిక శాఖ మంత్రి జాకీర్‌ హుస్సేన్‌ పై బాంబు దాడి జరిగింది. ముర్షిదాబాద్ జిల్లాలో ఒక అధికారిక కార్యక్రమానికి హాజరు అయ్యి ఇంటికి వెళ్తున్న సమయంలోనే ఆయనపై ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. కోల్‌కత్తా వెళ్లేందుకు నిమ్టిటా స్టేషన్‌ వైపు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై బాంబులు విసిరారు. బాంబు దాడిలో తీవ్ర గాయ పడ్డ మంత్రి జాకీర్‌ హుస్సేన్‌ ను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.

టీఎంసీ పార్టీ వర్గాల వారు మరియు ప్రభుత్వ వర్గాల వారు ఈ దాడిని ఖండించారు. పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం జాకీర్ హుస్సేన్ కాలుకు తీవ్ర గాయం అయ్యిందని ఆయన కాలుకు ఆపరేషన్‌ అవసరం అవుతుందని అంటున్నారు. బాంబు దాడిలో మంత్రితో పాటు ఆయన అనచరులు కూడా తీవ్ర గాయాల పాలయినట్లుగా సమాచారం అందుతోంది. ఈ బాంబు దాడిలో ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. బాంబు దాడికి సంబంధించిన విచారణ వేగంగా జరుపుతున్నట్లుగా పోలీసు ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారు.