ఒక సినిమా హిట్ కావడం వేరు .. సంచలనం సృష్టించడం వేరు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ అన్ని వయసుల వారిని ఆకట్టుకోవడం వేరు. ఆ సినిమాలోని పాటలకు .. మేనరిజమ్స్ కు స్పందించడం వేరు. ఈ విధమైన రెస్పాన్స్ ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లోను కనిపించడం మరో విశేషం.
అలాంటి ఒక అరుదైన రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమాగా ‘పుష్ప’ కనిపిస్తుంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు. డిసెంబార్ 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను తన ప్రభంజనాన్ని కొనసాగించింది.
‘పుష్ప’ సినిమాకి కథాకథనాలు .. పాత్రలను మలిచిన తీరు .. దేవిశ్రీ పాటలు ప్రధానమైన బలంగా నిలిచాయి. ప్రతి పాట కూడా ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. ‘శ్రీ వల్లీ’ పాటకి బన్నీ వేసిన ఒక స్టెప్ ఒక రేంజ్ లో జనంలోకి దూసుకుపోయింది.
చెప్పు జారిపోతే తిరిగి తొడుక్కుంటూ బన్నీ వేసే ఈ స్టెప్ ను ఎంతోమంది సెలబ్రెటీలు అనుకరించడం విశేషం. అలాగే ‘తగ్గేదే లే’ అనే బన్నీ డైలాగ్ కూడా బాగా పాప్యులర్ అయింది. ఈ మధ్య కాలంలో మేనరిజంతో కూడిన ఒక డైలాగ్ ఇంతగా పాప్యులర్ కావడం ‘పుష్ప’ విషయంలోనే జరిగిందని చెప్పాలి.
ఇక ఆయా వేదికలపై పాండా బొమ్మలు .. యానిమేటెడ్ క్యారక్టర్స్ కూడా ‘శ్రీ వల్లీ’ స్టెప్పును వేయడం .. ‘తగ్గేదే లే’ అనే మేనరిజమ్ ను అనుకరించడం చేస్తున్నాయి. ఆయా షోస్ కి ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి అంటే ఈ సినిమా ఎంతగా ప్రేక్షకులను ప్రభావితం చేసిందనేది అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఒక షోలో ఒక పాండా బొమ్మ ‘పుష్ప’ లో పాటకి స్టెప్పు వేయగా అక్కడే ఉన్న జగపతిబాబు స్పందించాడు. “నేను కూడా ఆ పాండాతో కలిసి స్టెప్పు వేశాను .. దీనికి కారకులు బన్నీ .. సుకుమార్. ఈ సినిమాను ఇంతగా జనంలోకి తీసుకెళ్లిన ‘పుష్ప’ టీమ్ కి హ్యాట్సాఫ్” అని చెప్పాడు.
ఇక ‘పుష్ప 2’ కి సంబంధించిన సన్నాహాలు కూడా చకచకా జరిగిపోతున్నాయి. వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. ‘పుష్ప 2’ను 4 నుంచి 6 నెలల్లో పూర్తిచేయాలని సుకుమార్ టీమ్ కి బన్నీ చెప్పాడట. సాధ్యమైనంతవరకూ ఈ సినిమాను ‘దసరా’ బరిలో దింపాలనే తన నిర్ణయాన్ని ఆయన చెప్పినట్టుగా సమాచారం. ఆ దిశగానే ఈ సినిమాకి సంబంధించిన పనులు మొదలుకానున్నట్టు చెబుతున్నారు. ఈ దసరాకి ‘పుష్ప 2 కాస్త గట్టిగానే సందడి చేస్తాడనే విషయం అర్థమవుతూనే ఉంది.