జనసేన కాదు, తిరుపతి బరిలో నిలిచేది బీజేపీ అభ్యర్థే.!

విషయం ఇప్పుడు అధికారికం. తిరుపతి ఉప ఎన్నికల బరిలో నిలిచేది బీజేపీ అభ్యర్థి. మిత్రపక్షం జనసేన పార్టీ, బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తుంది. తిరుపతి ఉప ఎన్నిక నుంచి బీజేపీ ‘విజయపు నడక’ ప్రారంభమవుతుందని బీజేపీ చెబుతోంది. బీజేపీ జాతీయ స్థాయి నేత మురళీధరన్ ఈ ప్రకటన చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌తో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ జాతీయ స్థాయి నేత సునీల్ దేవధర్ ఈ రోజు సమావేశమయ్యారు.. తిరుపతి ఉప ఎన్నికపై చర్చించారు. ఈ చర్చలు సత్ఫలితాన్నిచ్చాయనీ, బీజేపీ అభ్యర్థిని బరిలోకి దించడానికి ఇరుపక్షాలూ అంగీకరించాయనీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ప్రకటించేశారు.

ఇప్పుడంటే, ఇది అధికారిక ప్రకటన అయ్యిందిగానీ.. నిజానికి, తిరుపతి ఉప ఎన్నికలో నిలబడేది బీజేపీ అభ్యర్థేనని గతంలోనే అందరికీ తెలిసిపోయింది. జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు.. ఇలా పలువురు బీజేపీ నేతలు గతంలోనే, తిరుపతి ఉప ఎన్నికపై స్పష్టత ఇచ్చారు.

అయితే, బీజేపీ అత్యుత్సాహం నేపథ్యంలో జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేసేసరికి, జనసేనాని పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ‘జాతీయ నాయకత్వంతో మాట్లాడదాం..’ అని పార్టీ నేతలకు పవన్ నచ్చజెప్పారు. ఆ తర్వాత పలు మార్లు ఈ విషయమై రెండు పార్టీల మధ్యా చర్చలు జరిగాయి.

ఒక్కటి మాత్రం నిజం, పంచాయితీ ఎన్నికలో బాగానే ప్రభావం చూపిన జనసేనను కాదని.. బీజేపీనే బరిలోకి దిగడం ఖచ్చితంగా జనసేన శ్రేణుల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. ‘జనసేన అభ్యర్థిని నిలబెట్టకపోతే, ఎన్నికల్నే బహిష్కరిస్తామంటూ ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు అప్పట్లో ఓ సమావేశం పెట్టుకుని తీర్మానం చేసిన సంగతి తెల్సిందే. అయినాగానీ, బీజేపీ, జనసేనను పక్కన పెట్టడం ఆశ్చర్యకరం.

‘ఎవరు నిలబడినా, గెలిచే స్థాయిలో పోరాడాల్సిందే..’ అని జనసేనాని ఇటీవల వ్యాఖ్యానించిన దరిమిలా, బీజేపీ జాతీయ నాయకత్వం తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వస్తుందా.? వైసీపీని ఓడించే స్థాయిలో బీజేపీ చిత్తశుద్ధి వుంటుందా.? వేచి చూడాల్సిందే.