కోవిడ్‌ వల్ల చాలా మారిపోయాయి

‘‘కోవిడ్‌ వల్ల చాలా విషయాలు మారిపోయాయి. ఇండస్ట్రీకి ఓ రకంగా మేలు కూడా జరిగింది. కరోనా లాక్‌డౌన్‌లో ప్రపంచ సినిమాలు చూస్తున్నారు ప్రేక్షకులు. వాళ్ల అభిరుచి మారింది. దానికి తగ్గట్టుగా కొత్త కథలు, కొత్త ఐడియాలతో సినిమాలు చేయాలి. అది ఓ రకంగా మంచిదే కదా’’ అని జేడీ చక్రవర్తి అన్నారు. జేడీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఎమ్‌ఎమ్‌ఓఎఫ్‌ ఉరఫ్‌ 70 ఎంఎం’. ఎన్‌ . ఎస్‌.సి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో ఓ పాత థియేటర్‌ నడుపుకునే వ్యక్తి పాత్ర చేశాను. థియేటర్‌ సరిగ్గా నడవడంలేదని బూతు సినిమాలు ప్రదర్శిస్తుంటాను. అనుకోకుండా నా థియేటర్‌లో హత్యలు జరుగుతుంటాయి. వాటి వెనక ఉన్నది ఎవరు? ఇందులో నుంచి నేను ఎలా బయటపడ్డాను? అనేది కథ. ప్రస్తుతం ‘కిటికీ’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నా’’ అన్నారు.