రాజకీయాల్లో వ్యక్తి పూజ సర్వసాధారణమైపోయింది. మంత్రి పదవి కోసమో, నామినేటెడ్ పదవి కోసమో ‘కాకా పట్టడం’, ‘వ్యక్తి పూజ’ చేయడం, ‘స్వామి భక్తిని’ చాటుకునేందుకు అడ్డమైన గడ్డీ తినడానికి వెనుకాడకపోవడం చాలాకాలంగా చూస్తున్న వ్యవహారమే. అది ఇప్పుడు ఇంకాస్త శృతిమించిందంతే. రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాశారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కొత్తగా ఇంకో రాజ్యాంగం రచించబడుతోందట. అది బీసీ రాజ్యాంగమట. దాన్ని రాస్తున్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అట. అలాగని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘అంబేద్కర్ రాజ్యాంగం కంటే బీసీలకు వైఎస్ జగన్ రాజ్యాంగం 4 రెట్లు మేలు..’ అంటూ జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇదెక్కడి పోలిక.? అసలు మన దేశంలో మనం మనుగడ సాధించగలుగుతున్నది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే. దానికి లోబడే, ఏ ప్రభుత్వమైనా పరిపాలన చేసేది. దాన్ని మించిన రాజ్యాంగం.. అంటే, అంబేద్కర్ రాసిన, మనం అమల్లో వుంచుతోన్న రాజ్యాంగాన్ని అవమానిస్తున్నట్లే కదా.?
చంద్రబాబు హయాంలో బీసీలకు ఒక్క రూపాయి కూడా సాయం అందలేదన్నది పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నమాట. ఇదెక్కడి చోద్యం.? ఏ ప్రభుత్వమైనా అందరికీ అన్నీ చేయాల్సిందే. వీలైనంతవరకు చేస్తాయి.. కొత్త ప్రభుత్వాలు వచ్చాక, మరింతగా పబ్లిసిటీ స్టంట్లు చేస్తాయి. వైఎస్ జగన్ ఐదేళ్ళ పాలన పూర్తయ్యేసరికి బీసీల్లో ఎవరూ పేదలు వుండరని ఎమ్మెల్యే జోగి రమేష్ అయినా, ఇంకో వైసీపీ నేత అయినా చెప్పగలరా.? ఛాన్సే లేదు.
చంద్రబాబు హయాంలో కంటే వైసీపీ హయాంలో రేషన్ కార్డులెక్కువయ్యాయ్. దానర్థమేంటి.? పేదలు పెరిగారనే కదా.? మరి, ఏం అభివృద్ధి మనం సాధిస్తున్నట్టు.? వ్యక్తి పూజకీ ఓ హద్దు వుంటుంది. వైఎస్ జగన్ అయినా, ఇంకొకరైనా తమ జేబుల్లోంచి తీసి ప్రజల కోసం ఖర్చు చేయరు. ఎన్నికలప్పుడు ఓట్లు కొనేందుకోసమే ఖర్చు చేస్తారు. అధికారంలో ఎవరున్నా, ప్రజా ధనాన్నే ఖర్చు చేయాలి.
ప్రజా ధనాన్ని, ప్రజల కోసం ఖర్చు చేసి, అక్కడికేదో తమ జేబుల్లోంచి ఖర్చు చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడమే కాక, కొత్తగా ఈ రాజ్యాంగాలు తెరపైకి రావడమేంటో.? మంత్రి పదవి కోసం మరీ ఇంతలా తమ స్థాయిని నేతలు దిగజార్చేసుకోవాలా.? అయినా, దిగజారడంలో ఇప్పటికే మన రాజకీయం పాతాళాన్ని కూడా చూసేసింది.. అయినా, సరికొత్త లోతుల్ని వెతుక్కుంటూనే వున్నారు రాజకీయ నాయకులు.. దిగజారిపోయే విషయంలో.