ఎన్టీఆర్ స్క్రిప్ట్ పై కొరటాల కసరత్తు .. రంగంలోకి సీనియర్ రైటర్!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో కొరటాల ఒకరు. ఒక సినిమా తరువాత ఒక సినిమాను ఆయన చాలా కూల్ గా చేస్తూ వస్తుంటాడు. తన సినిమా కథలు .. ఆ కథలోని పాత్రలు .. ఆ పాత్రల స్వరూప స్వభావాల విషయంలో ఆయన చాలా క్లారిటీగా ఉంటాడు. పాత్రల ఎంపిక విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఏ పాత్రను చూసినా వాళ్లు దానికి సెట్ కాలేదు అనే ఆలోచన రాదు. తూకం వేసినట్టుగా ఆయన తన సినిమాల్లోని పాత్రలను ఆవిష్కరిస్తూ ఉంటాడు. మాటల్లోనూ .. పాటల్లోను ఆ పద్ధతి కనిపిస్తుంది. అందువల్లనే ఇంతవరకూ పరాజయమనేది ఆయనకి ఎదురుపడే సాహసం చేయలేదు.

అలాంటి కొరటాల .. చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా చేశాడు. కాజల్ కథానాయికగా నటించిన ఆ సినిమాలో చరణ్ – పూజ హెగ్డే ప్రత్యేకమైన పాత్రలను పోషించారు. దాంతో ఆయన చిరంజీవి – చరణ్ సినిమాలను వేరు వేరుగా చేస్తున్నంత బాధ్యతను మోయవలసి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తూనే మరో వైపున తరువాత చేయనున్న ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన పనులను కూడా ముందుకు తీసుకుని వెళుతున్నాడు. ఈ స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ కి సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట.

ఈ సన్నివేశాలను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దడం కోసం సీనియర్ రచయిత సత్యానంద్ ను కూడా రంగంలోకి దింపినట్టుగా చెబుతున్నారు. ఆయనతో పాటు శ్రీధర్ సీపాన .. వేమారెడ్డి కలిసి స్క్రిప్ట్ పరమైన కసరత్తులో పాల్గొంటున్నారని అంటున్నారు. ఈ సీన్స్ విషయంలో ఎన్టీఆర్ తన సంతృప్తిని వ్యక్తం చేస్తే ఇక సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి. ఇంతవరకూ కొరటాల ఏ సినిమా చేసినా ఏదో ఒక సందేశాన్ని సున్నితంగా ఆవిష్కరిస్తూ వచ్చాడు. అలాగే ఈ సినిమాలోనూ ఒక సందేశాన్ని ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది.

ఇంతకు ముందు కొరటాల – ఎన్టీఆర్ కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ వచ్చింది. యాక్షన్ తో పాటు ఎమోషన్స్ ఉన్న ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ‘జనతా గ్యారేజ్’లో మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ ఒక కీలకమైన పాత్రను పోషించారు. అలాగే ఈ సినిమాలోనూ కీలకమైన ఒక పవర్ఫుల్ రోల్ కోసం మమ్ముట్టిని తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక కథానాయికగా అలియా భట్ .. రష్మిక పేర్లు వినిపిస్తున్నాయి. ఫైనల్ గా ఎవరిని తీసుకుంటారనేది చూడాలి. ఇక ఎన్టీఆర్ ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే.