పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ వెనక్కు తగ్గాలి: కేఏ పాల్

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామన్న సీఎం జగన్ ప్రకటనపై కేఏ పాల్ మండిపడ్డారు. అది అవివేకమైన నిర్ణయమని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశాం. పరీక్షలు నిర్వహిస్తే కరోనా కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. పరీక్షలను రెండు నెలలైనా వాయిదా వేయాలి.

పరీక్షలు నిర్వహిస్తే కరోనా వైరస్ సునామీ కంటే వేగంగా పెరుగుతుంది. వైరస్ తీవ్రత ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం, మంత్రులు తమ పిల్లలనైతే పరీక్షలకు పంపుతారా? ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకోకపోతే విద్యార్ధులు కరోనాకు బలైపోయే అవకాశం లేకపోలేదు. రాజకీయ నేతల నిర్లక్ష్యంతో ప్రజలు బాధపడుతున్నారు.

కుంభమేళా, ఎన్నికల నిర్వహణ, బహిరంగ సభలతో కరోనా విజృంభణకు పాలకులే కారణమయ్యారు. ప్రజల ప్రాణాలు పోకుండా చూసే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఏపీకి కరోనా కిట్లు, ఆక్సిజన్ సిలిండర్లు పంపించాలని పక్క రాష్ట్ర ప్రభుత్వాలని కోరాను.