టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొత్త జీవితం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 30న ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ లో తన ప్రియుడు గౌతమ్ కిచ్లుతో వైభవంగా కాజల్ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా నటన కొనసాగిస్తానని ప్రకటించిన చందమామ.. కాళ్ళ పారాణి ఆరక ముందే షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అయిందని తెలుస్తోంది. ఏడేళ్లుగా స్నేహం చేసి వ్యక్తితో మూడేళ్లు డేటింగ్ చేసి తర్వాత పెళ్లి చేసుకున్న కాజల్.. జీవిత భాగస్వామితో హనీమూన్ అంటూ కొన్నాళ్ళు ఏకాంతంగా గడిపిన తర్వాత సెట్స్ లో అడుగుపెడుతుందని అందరూ అనుకున్నారు. అయితే కాజల్ మాత్రం పెళ్లైన వెంటనే సినిమా షూటింగ్ లో పాల్గొనాలని నిర్ణయించుకుంది.
తమిళ మలయాళ భాషల్లో తెరకెక్కనున్న ‘హే సినామికా’ సినిమాలో కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ – అదితిరావు హైదరీ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ తర్వాత ఇటీవల తిరిగి ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ కి వస్తానని చిత్ర యూనిట్ కు కాజల్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. నవంబర్ 10 నుంచి షూటింగ్ లో పాల్గొనడానికి అమ్మడు రెడీ అవుతోందని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా కూడా నవంబర్ 9 నుండి తిరిగి స్టార్ట్ కానుంది. నెల రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో కూడా హీరోయిన్ కాజల్ పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనా పెళ్లికి ముందు ఇచ్చిన కమిట్మెంట్స్ మేరకు ప్రొడ్యూసర్స్ మేలు కోరి వృత్తికి దర్మం పాటిస్తూ షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధపడిన కాజల్ ని అందరూ మెచ్చుకుంటున్నారు.