నందమూరి కళ్యాణ్ రామ్ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘బింబిసార’ అనే సోషియో ఫాంటసీ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో వశిష్ట అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ రూపొందించిన ఈ సినిమా.. ర్రేపు శుక్రవారం విడుదల కానుంది.
కళ్యాణ్ రామ్ ఎక్కువ శాతం తన హోమ్ బ్యానర్ లోనే సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అలానే తమ్ముడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘జై లవకుశ’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారు. తారక్ తదుపరి రెండు చిత్రాలలోనూ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నారు.
అయితే ఎన్టీఆర్ ఆర్ట్స్ లో తన బాబాయ్ నటసింహం నందమూరి బాలకృష్ణ తో కళ్యాణ్ రామ్ సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘బింబిసార’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన మీడియా ఇంటరాక్షన్ లో కళ్యాణ్ రామ్ ఈ విషయం మీద స్పందించారు. ఎప్పటి నుంచో బాలయ్య తో మూవీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
“బాలయ్య బాబాయ్ కి ఒకసారి కథ చెప్పించా. అది నచ్చలేదు. మాకు నచ్చిన కథ బాబాయికి నచ్చాలని లేదు కదా. భవిష్యత్తులో మరో మంచి కథ మా దృష్టికి వస్తే తప్పకుండా బాబాయ్ ను కలుస్తా. ఆయనకు కథ నచ్చే వరకు ప్రయత్నిస్తా. మా బ్యానర్ లో ఆయనతో సినిమా తప్పకుండా జరుగుతుంది” అని కళ్యాణ్ రామ్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ తో కలిసి నటిస్తారా? మల్టీస్టారర్ చేయడానికి మీరు రెడీనా? అని అడగ్గా.. ‘ఏముందండీ కథలొస్తే చేయడానికి రెడీనే’ అని రొటీన్ గా నేను చెప్పలేను. ఇద్దరు స్టార్స్ కలుస్తున్నారంటే చాలు కథేమిటనే అంశంతో సంబంధమే లేకుండా ప్రేక్షకులు అంచనాలు పెంచుకుంటారు. అందుకు తగ్గట్టుగా ఉండాలి. లేదంటే సమస్యలొస్తాయి అని కళ్యాణ్ రామ్ చెప్పారు.
ఇద్దరు స్టార్ హీరోలను కలిపి RRR తీయడానికి మనకి ఇంత సమయం పట్టింది. ఆ బాధ్యతని రాజమౌళి లాంటి దర్శకుడు పూనుకుంటేనే అయ్యింది. మల్టీస్టారర్ సినిమాలు కుదరడం మాట్లాడుకున్నంత సులభం కాదు. ‘మనం’ తరహా చిత్రాలు చేయాలన్నా సరే.. చాలా అంశాలు కుదరాలి అని చెప్పుకొచ్చారు.
వాస్తవానికి నందమూరి హీరోల కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అక్కినేని మూడు జెనెరేషన్ హీరోలు ‘మనం’ సినిమాలో నటించగా.. ‘ఆచార్య’ లో చిరంజీవి – రామ్ చరణ్ కలిసి నటించారు. ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ లో దగ్గుబాటి హీరోలు వెంకటేష్ – రానా కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
ఇదే క్రమంలో బాలకృష్ణ – ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ కలిసి ఒక సినిమా చేయాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి భవిష్యత్ లో ఈ కలయికలో మూవీ సాధ్యపడుతుందేమో చూడాలి.
ఇకపోతే కళ్యాణ్ రామ్ గతంలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ లో బాలకృష్ణ తో కలిసి నటించాడు. ఇందులో తన తండ్రి నందమూరి హరికృష్ణ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. అలానే బాలయ్య హీరోగా నటించిన ‘బాలగోపాలుడు’ ‘తల్లిదండ్రులు’ వంటి చిత్రాల్లో బాలనటుడిగా కళ్యాణ్ రామ్ నటించారు.