మంత్రి కొడాలి నాని నియోజకవర్గం గుడివాడలో ఆయనకే చెందిన కె-కన్వెన్షన్ హాల్ లో క్యాసినో నిర్వహించారనే వివాదం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. దీనిపై పోలీసులు విచారణ కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈరోజు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ గుడివాడలో పర్యటించడం.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం కూడా తెలిసిందే. ఈనేపధ్యంలో ఈ అంశంపై మంత్రి కొడాలి నాని క్యాబినెట్ భేటీ అనంతరం స్పందించారు.
‘టీడీపీ నాయకులకు నా చాలెంజ్. 2.5 ఎకరాల్లో ఉన్న నా కె-కన్వెన్షన్ హాల్ లో జూదం నిర్వహించామని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుని, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా. చంద్రబాబు అండ్ కో ఎన్ని కుట్రలు పన్నినా గుడివాడలో నన్నేమీ చేయలేరు. సంక్రాంతి పండగలో భాగంగా రాష్ట్రమంతటా జరిగినట్టే కోడిపందాలు, జూదం గుడివాడలోనూ జరిగాయి. మహిళలతో డ్యాన్సుల అంశం తన దృష్టికి రాగానే నేనే డీఎస్పీకి ఫోన్ చేశా. ఆయన వెంటనే స్పందించి ఆ కార్యక్రమాలన్నీ ఆపేయించారు’ అని అన్నారు.