నన్ను మంత్రి పదవి నుంచి తప్పించాలనేది చంద్రబాబు తపన: కొడాలి నాని

గుడివాడలో క్యాసినో వ్యవహారంపై తనపై టీడీపీ చేస్తున్న విమర్శలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అల్జీమర్స్ తో బాధపడుతున్నారు. నన్ను మంత్రి పదవి నుంచి తప్పించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మీడియాలో కొందరు నాపైనే దృష్టి పెట్టారు. నిజం నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ విసిరితే.. కే- కన్వెన్షన్ లో అన్నవారు, కే-కన్వెన్షన్ సమీపంలో, అటుపై గుడివాడలో క్యాసినో జరిగిందంటూ మాటలు మార్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

టీడీపీ నిజనిర్ధారణ కమిటీలో ఉన్నవారంతా 420 బ్యాచే. వీళ్లను ప్రజలు రాజకీయ సమాధి చేసి రెండున్నరేళ్లు అయింది. వచ్చే ఎన్నికలు కాదు.. సమీప భవిష్యత్తులో టీడీపీ గెలిచేది లేదు. మీకు 2034 వరకు టైమిస్తున్నా.. గెలిచి చూపించండి. విజయవాడ కమిషనర్ గా చేసిన డీజీపీకి బుద్ధా వెంకన్న ఎలాంటివాడో, బోండా ఉమ ఎలాంటివాడో బాగా తెలుసు. బుద్ధా వెంకన్న ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి. పిచ్చివాగుడు వాగితే పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు’ అని ఘాటుగా హెచ్చరించారు.