అయ్యో.. రెబల్ స్టార్ కి అలా జరిగిందా?!

తెలుగులో గంభీరమైన రూపం .. అందుకు తగిన వాయిస్ ఉన్న సీనియర్ నటులలో ఎన్టీఆర్ .. ఎస్వీఆర్ తరువాత స్థానంలో కృష్ణంరాజు కనిపిస్తారు. ఆయన కళ్లెర్రజేస్తేనే విలన్స్ కంగారుపడిపోయారు. ఆయన డైలాగులు చెబితేనే విలనిజాన్ని వదిలేశారు. అప్పట్లో ఎన్టీఆర్ పౌరాణికాలతో .. ఏఎన్నార్ సాంఘికాలలో రొమాంటిక్ హీరోగా జోరుమీద ఉన్నారు.

ఇక యాక్షన్ హీరోగా కృష్ణ .. ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ శోభన్ బాబు తమదైన ప్రత్యేకతలతో దూసుకుపోతున్నారు. ఆ సమయంలో తాను ఏం చేస్తే బాగుటుందా అని భావించిన కృష్ణంరాజు మాస్ ఆడియన్స్ మెచ్చే పాత్రలను చేస్తూ రెబల్ స్టార్ అనిపించుకున్నారు.

ధీర గంభీర పాత్రలను పోషిస్తూ తెలుగు తెర రాజసం .. కృష్ణంరాజు అనిపించుకున్నారు. అలాంటి కృష్ణంరాజు వయసు పైబడిన కారణంగా కొంతకాలంగా సినిమాలు చేయడం లేదు. తన సొంత బ్యానర్లో అడపా దడపా సినిమాలను నిర్మిస్తూ వెళుతున్నారు. ఈ వ్యవహారాలన్నీ కూడా ఆయన కూతురే చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య ఆయన బాత్ రూమ్ పడిపోయారు. ఆ సమయంలో ఆయన తుంటి భాగంలో ఫ్రాక్చర్ అయింది. ఆ కాలుకి ఆపరేషన్ చేయించగా ఆయన కోలుకుంటున్నారు.

ఆ సమయంలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ‘రాధేశ్యామ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయనను వీల్ చైర్ తో తీసుకుని వచ్చారు. అందరి దగ్గరికి పరిగెత్తుకు వచ్చి డాన్స్ చేయాలనుందనీ .. రెబల్ ఎప్పుడూ రెబల్ గానే ఉంటాడు అని ఆయన అనడం అభిమానుల మనసులను భారం చేసింది. త్వరగా నడవాలనే ఆయనలోని బలమైన కోరికను అభిమానులు అర్థం చేసుకుని బాధపడ్డారు.

ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అయితే రీసెంట్ గా ఆయన మరోసారి పడిపోయారట. దాంతో వెంటనే ఆయనను ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లడం .. ఆ తరువాత డిశ్చార్జ్ చేయడం జరిగిపోయాయని అంటున్నారు.

అయితే తాజాగా అందరూ చెప్పుకుంటున్నదేమిటంటే తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ ద్వారా ఆయన కాలు వ్రేలును తొలగించారట. కృష్ణంరాజు అభిమానులకు నిజంగా ఇది బాధను కలిగించే విషయమే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. నిజానికి ఆయన ‘రాధేశ్యామ్’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాలని అనుకున్నారట. కానీ అనుకోకుండా మరోసారి ప్రమాదం జరగడం వలన ఈ ప్రమోషన్స్ కి ఆయన దూరంగా ఉండవలసి వచ్చింది. ఇక ప్రభాస్ తన పెదనాన్న ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ఆయన కోసమైనా ఈ సినిమా హిట్ కొట్టాలని కోరుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ కోసం కేరళ వెళ్లింది.