ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి. ఆకర్షించే ఆందంతో పాటు, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులకు తక్కువ సమయంలోనే ఎక్కువ దగ్గరైంది. ఉప్పెన సినిమా విజయంలో కృతిశెట్టి కీలక పాత్ర వహించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వైష్ణవ్ తేజ్‌కు జంటగా బేబమ్మ పాత్రలో తన అమాయకపు నటనతో సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది.
‘ఉప్పెన’తో భారీ విజయం అందుకున్న ఈ అందాల తార.. వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బిజీగా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నాని హీరోగా తెరకెక్కుతోన్న శ్యామ్ సింగ రాయ్‌తో పాటు.. సుధీర్ బాబు నటిస్తోన్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాల్లో నటిస్తోంది. అలాగే తెలుగు, తమిళ భాషల్లో ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ‘బేబమ్మ’.. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మీకు ఉన్న కోరిక ఏంటని ఓ అభిమాని ప్రశ్నించగా.. తనకు తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవాలని ఉందని చెప్పింది. ఆ కోరిక నెరవేర్చే దర్శకుడి కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. తనకు టాలీవుడ్ బాగా నచ్చిందని, తెలుగు ప్రేక్షకులు తనపై చూపే ప్రేమ, అభిమానానికి చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. మరి ‘బేబమ్మ’ కోరిక నెరవేర్చే దర్శకుడు ఎవరో చూడాలి.