ఇంకో పాతిక వస్తాయనుకున్నాం: కేటీఆర్‌ నిర్వేదం

‘ఇంకో పాతిక సీట్లు గెలుస్తామనుకున్నాం.. కానీ, మా అంచనాలు నిజం కాలేదు. అయితే, ఓ పదిహేను చోట్ల చాలా తక్కువ ఓట్ల తేడాతోనే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయినాసరే, సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా టీఆర్‌ఎస్‌ని గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు..’ అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిర్వేదంతో కూడిన వ్యాఖ్యలు చేశారు గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ. ‘ఖచ్చితంగా ఈసారి సెంచరీ కొడ్తాం..’ అంటూ పదే పదే నినదిస్తూ వచ్చిన కేటీఆర్‌, ఇంకో పాతిక సీట్లు.. అంటే, 75 నుంచి 85 సీట్లు మాత్రమే మొత్తంగా ఆశించడమేంటి.? ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. లోపల లెక్కలు వేరు, బయట మాట్లాడే మాటలు వేరు.. అని కేటీఆర్‌ స్వయంగా మీడియా ముందు అంగీకరించినట్లయ్యింది.

‘మేం హైద్రాబాద్‌ని ఓ రేంజ్‌లో ఉద్ధరించేశాం..’ అని కేటీఆర్‌ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టేస్తే, ‘ఉద్ధరించింది చాల్లే..’ అని ఓటర్లు తేల్చి చెప్పేశారా.? అన్న చర్చ గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సర్వత్రా జరుగుతోంది. బండి సంజయ్‌నీ, మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌నీ ఉద్దేశించి ‘పిచ్చోళ్ళు’ అని ఎద్దేవా చేసిన కేటీఆర్‌, ఇప్పుడు గ్రేటర్‌ ఫలితాలపై ఏం మాట్లాడగలుగుతారు.? మజ్లిస్‌ దాదాపుగా తన స్థానాల్ని నిలబెట్టుకుంది. పైగా, టీఆర్‌ఎస్‌ మిత్రపక్షమది. ‘అబ్బే, మజ్లిస్‌తో మాకు పొత్తు లేదు..’ అని కేటీఆర్‌ చెప్పారుగానీ, ఇప్పుడు ఆ మజ్లిస్‌ సాయం లేకుండా జీహెచ్‌ఎంసీ పగ్గాల్ని చేపట్టడం టీఆర్‌ఎస్‌కి అంత తేలిక కాదు. మరోపక్క, బీజేపీ.. ఇప్పుడు టీఆర్‌ఎస్‌కి కొరకరాని కొయ్యిలా తయారైంది.

ముందు ముందు రాజకీయ పరిణామాలు ఎలా మారబోతున్నాయో కేటీఆర్‌కి బాగా తెలుసు. తమ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో పార్టీ ఓటమి నేపథ్యంలో ఎమ్మెల్యేలు, గులాబీ కోట నుంచి బయటకు వచ్చేసి, బీజేపీ పంచన చేరితే పరిస్థితి ఏంటి.? టీఆర్‌ఎస్‌ ఎలాగైతే పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిందో.. అదే స్థాయిలో బీజేపీ పార్టీ ఫిరాయింపులకు దిగితే, టీఆర్‌ఎస్‌ ఖాళీ అయిపోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. అవన్నీ తర్వాత, మేయర్‌ ఎన్నికల నాటికి ఎంతమంది కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌తో వుంటారు.? అన్నదే ముఖ్యమైన చర్చ ఇక్కడ.