కేటీఆర్‌ కోసమే కేసీఆర్‌ రాజీపడుతున్నారా.?

దెబ్బ మీద దెబ్బ.. మళ్ళీ మళ్ళీ దెబ్బ.. వరుసగా గులాబీ పార్టీకి దెబ్బలు తగులుతున్నాయి. కేసీఆర్‌ కుమార్తె కవిత లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోవడం, దుబ్బాక ఉప ఎన్నికలో అన్నీ తానే అయి వ్యవహరించినా, పార్టీని హరీష్‌రావు గెలిపించలేకపోవడం.. గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల బాధ్యత అంతా భుజానికెత్తుకున్న కేటీఆర్‌, పార్టీకి అవసరమైనన్ని సీట్లు తీసుకురాలేకపోవడం.. ఇవన్నీ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కి తలనొప్పి వ్యవహారాలే. ముఖ్యమంత్రిగా ఆరున్నరేళ్ళ పాలన తర్వాత ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత కన్పిస్తుంటుంది. కానీ, అది అనూహ్యంగా పెరిగిపోతే ఏంటి పరిస్థితి.? ఇలాంటి తరుణంలో బీజేపీతో పంచాయితీ అనవసరం.. అన్న నిర్ణయానికి కేసీఆర్‌ వచ్చారా.? అంటే, అవుననే అభిప్రాయం సర్వత్రా విన్పిస్తోంది.

కొత్త పార్లమెంటు నిర్మాణం విషయమై ప్రధానిని కేసీఆర్‌ అభినందించడం, ఆ వెంటనే ఢిల్లీకి వెళ్ళి.. పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కేసీఆర్‌ సమావేశమవడం.. ఈ క్రమంలో రహస్య భేటీలు కూడా జరుగుతుండడంతో.. కేసీఆర్‌ ‘రాజీ’ పడక తప్పదేలన్న గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పైగా, సమయానుకూలం రాజకీయ వ్యూహాలు మార్చుకోవడంలో కేసీఆర్‌ దిట్ట. తెలంగాణకి సంబంధించి కొన్ని కీలక అంశాల్ని కేంద్రం ముందుంచిన కేసీఆర్‌, వాటి పరిష్కారం దిశగా కేంద్రం గనుక సానుకూలంగా స్పందిస్తే, ఎన్డీయేకి బయట నుంచి ఇంకాస్త గట్టిగా మద్దతివ్వడం లేదా ఎన్డీయేతో కలిసి పనిచేయడం వంటి అంశాల గురించి ఆలోచిస్తానని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు విన్నవించారంటూ తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.. ఆ మేరకు మీడియాకి లీకులు అందుతున్నాయి కూడా. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.

నిన్న శతృవు, నేడు మిత్రుడు.. ఈ ఈక్వేషన్‌ ప్రస్తుత రాజకీయాలకు పక్కాగా సూట్‌ అవుతుంది. కేసీఆర్‌ ఇందుకు అతీతుడేమీ కాదు. ఎందుకంటే, కాంగ్రెస్‌ సహా అన్ని రాజకీయ పార్టీలతోనూ సందర్భానుసారం పొత్తులు పెట్టుకున్న ఘన చరిత్ర కేసీఆర్‌ సొంతం. ‘తెలంగాణ కోసం గొంగలిపురుగునైనా ముద్దాడతా..’ అని గతంలో పలుమార్లు చెప్పిన కేసీఆర్‌, ఆ పేరు చెప్పి.. రాజకీయంగా ఎలా కావాలంటే అలా పబ్బం గడిపేసుకోగలరు.