మేం తలుచుకుంటే బయట తిరగగలరా: కేటీఆర్ వార్నింగ్

టీఆర్ఎస్ కార్యకర్తలకు ఓపిక నశిస్తే బీజేపీ నాయకులు బయట తిరగగలరా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తమ ఓపికకూ ఓ హద్దు ఉంటుందని, తెలంగాణలో చిచ్చు పెట్టేలా బీజేపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను ప్రజలు గమనించాలని కోరారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు చేసిన దాడులను ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు ఏమాత్రం చోటులేదని స్పష్టంచేశారు.

టీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడుకునే శక్తి, బలం తమకు ఉన్నాయనే విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. శనివారం పరకాల టీఆర్ఎస్ ఎమ్మెలయే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడి చేశాయి. అయోధ్యలో రామమందిరం నిర్మాణం పేరుతో బీజేపీ నాయకులు తెలంగాణలో రూ.వెయ్యి కోట్లు వసూలు చేశారని ధర్మారెడ్డి ఆరోపించడంతో బీజేపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డాయి. ఆయన ఇంటి పైకి రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలు విసిరి అక్కడే బైఠాయించారు.

అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత టీఆర్ఎస్ కార్యకర్తలు హన్మకొండలోని బీజేపీ అర్బన్ కార్యాలయంపై ప్రతి దాడి చేశారు. రాళ్లు రువ్వడంతోపాటు అక్కడున్న ఫ్లెక్సీలను చించివేశారు. అనంతరం బీజేపీ నేతల ఇంటి వద్దకు వెళ్లి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. ఈ క్రమంలోనే కేటీఆర్ బీజేపీ నాయకులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.