మంత్రి కేటీఆర్ పంచ్ డైలాగ్స్ వైరల్..! మోదీని ఉద్దేశించేనా..?

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు షేక్ పేట తాహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఓటు వేశారు కేటీఆర్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఓ మహానుభావుడు గతంలో చెప్పినట్లు.. ఓటేసేందుకు ఇంట్లో గ్యాస్ సిలిండర్‌కు మొక్కి వచ్చాను అన్నారు. 2013లో సాధారణ ఎన్నికల సమయంలో మోదీ యూపీఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు.

యూపీఏ హయాంలో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగా ప్రభుత్వానిక సైటైర్ వేసేలా మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ బీజేపీపై వ్యంగ్యంగానే ఈ కామెంట్ చేశారు. కేటీఆర్ కామెంట్ వైరల్ అవడంతో పలువురు తమ ఇళ్లలో గ్యాస్ సిలిండర్లకు దణ్ణాలు పెడుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.