మహేంద్రసింగ్ ధోనీ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ప్రొడ్యూసర్ గా కోలీవుడ్ లో మొదటి చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఎల్జీఎం టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం ధోని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాక్షి సింగ్ నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది. ఒక ఇండిపెండెంట్ అమ్మాయి ప్రేమలో పడిన తర్వాత అబ్బాయి తల్లితో ఉండటానికి ఇష్టపడకపోవడం.
తరువాత వారి మధ్య బాండింగ్ పెంచుకోవడానికి ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేయడం. అక్కడ జరిగే ఫన్ తో ఈ చిత్రం తెరకెక్కింది. రమేష్ తమిళమణి దర్శకత్వంలో ఈ మూవీ సిద్ధమైంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ గట్టిగా చేశారు.
లెట్స్ గెట్ మ్యారీడ్ అనే ట్యాగ్ లైన్ తో వస్తోన్న ఈ చిత్రంలో హరీష్ కళ్యాణ్, లవ్ టుడే ఫేమ్ ఇవానా జోడీగా నటిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఫీల్ గుడ్ టచ్ తో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది. ఇక ఈ మూవీ సక్సెస్ అయితే ధోనీ నెక్స్ట్ సినిమాలు కొనసాగించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే తాజా ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే తమిళంలో ఈ మూవీ జులై 28న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. తాజాగా తెలుగులో రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు. ఆగష్టు 4న తెలుగులో ఈ మూవీ రిలీజ్ కానుంది.
ధోనికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ తో ఎల్జీఎం సినిమా మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. అయితే సినిమా సక్సెస్ మాత్రం కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. తెలుగులో ఈ చిత్రాన్ని త్రిపుర ప్రొడక్షన్స్, జేపీఆర్ ఫిలిమ్స్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నాయి. నదియా ఈ మూవీలో హీరో తల్లి పాత్రలో నటించింది.
ఆమె పాత్ర చాలా ఇంటరెస్టింగ్ గా డిజైన్ చేశారు. ఇక హీరో హరీష్ కళ్యాణ్ కూడా జెర్సీ మూవీతో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయ్యాడు. లవ్ టుడే మూవీతో ఇవానా టాలీవుడ్ లో మంచి మైలేజ్ అందుకుంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఆశీష్ రెడ్డికి జోడీగా సెల్ఫిష్ సినిమాలో ఇవానా నటిస్తోంది. ఇలాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తోన్న ఎల్జీఎం మూవీ తెలుగు ప్రేక్షకులని ఏ మేరకు మెప్పిస్తుందనేది చూడాలి.