మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రెసిడెంట్ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయన్న సంకేతాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే కొంత మంది క్రమశిక్షణా సంఘం అధ్యక్షులు కృష్ణంరాజుకు లేఖ రాసారు. అయితే గుట్టుగా జరగాల్సిన మా అధ్యక్ష ఎన్నికలు గత కొన్ని సంవత్సరాల నుండి రచ్చ అవుతున్నాయి.
మా సభ్యులు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ ఇంట జరగాల్సిన గొడవను రచ్చకీడుస్తున్నారు. ఇప్పటికే మా అధ్యక్ష ఎన్నికలకు మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, హేమ, జివిఎల్ నరసింహారావు తదితరులు పోటీ పడుతున్న విషయం తెల్సిందే.
తాజాగా రేసులోకి మరొక వ్యక్తి వచ్చారు. మా కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే కాదంబరి కిరణ్ ఈసారి రేసులో ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే పోటీ చేయడమే కాదు కచ్చితంగా తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. “900 మంది సభ్యులుంటే 450 మంది వరకూ మాత్రం ఓటు హక్కు వినియోగించుకుంటారని అందులో 300 ఓట్లు తనకే వస్తాయని” కాదంబరి కిరణ్ తెలిపారు.