మనం ఖచ్చితంగా బయటపడతాంః మహేష్ బాబు


కరోనాతో నిత్యం భయపడుతూ బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఎటువైపు నుంచి వైరస్ దాడి చేస్తుందోనని జనం హడలిపోతున్నారు. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కేసులు మరింత భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. పలువురు సెలబ్రిటీలు ధైర్యవచనాలు పలుకుతున్నారు. కరోనాను కలిసి కట్టుగా ఎదుర్కోవాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.

తాజాగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు పలు సూచనలు చేశారు. ధైర్యంగా వైరస్ ను ఎదుర్కోవాలన్న ప్రిన్స్.. ఈ పరిస్థితి నుంచి మనం ఖచ్చితంగా బయటపడతామని ఆశాభావం వ్యక్తంచేశారు.

‘‘కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న ఈ సమయంలో బయటకు వెళ్లే ప్రతిసారీ ఖచ్చితంగా మాస్కులు ధరించండి.. అది కూడా తప్పని సరైతేనే బయటకు వెళ్లండి. ఒకవేళ కరోనా పాజిటివ్ వస్తే.. స్వీయ నిర్బంధంలోకి వెళ్లండి. ప్రతిరోజూ మీ ఆరోగ్యాన్ని చెక్ చేసుకోండి.’’ అని చెప్పారు ప్రిన్స్.

‘‘ఇక తప్పదు ఖచ్చితంగా ఆసుపత్రిలో చేరాలని వైద్యులు చెబితేనే చేరండి. అలాగైతేనే అత్యవసర సమయంలో ఉన్నవాళ్లకు బెడ్లు దొరుకుతాయి. ఈ దుర్భర పరిస్థితి నుంచి మనం బయటపడతాం. మరింత శక్తివంతంగా తయారవుతామనే నమ్మకం నాకుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి’’ అని అన్నారు మహేష్.