టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. గతేడాది సరిలేరు నీకెవ్వరూ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అలాగే తన సినిమాలో యాక్షన్ తో పాటు కామెడీకి కూడా పెద్ద పీట వేస్తాడు పరశురామ్. వరుస హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్నటువంటి మహేష్ చాలా కథలు విన్న తర్వాత పరశురామ్ కథను ఓకే చేశాడు. మరి మహేష్ ఈ మధ్యకాలంలో మినిమం మేటర్ లేకుండా సినిమాలు ఓకే చేయడం లేదు. అలాంటిది ఇప్పుడు పరశురామ్ సినిమా పై ఒక్కసారిగా అంచనాలు పెంచేసాడు.
నిజానికి ఫస్ట్ లుక్ తోనే మహేష్ ఫ్యాన్స్ అందరికి ట్రీట్ ఇచ్చేసాడు. అదిగాక టైటిల్.. సర్కారు వారి పాట అనే టైటిల్ తోనే ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేసాడు డైరెక్టర్ పరశురామ్. ప్రస్తుతం సర్కార్ పాట గురించి ప్రేక్షకులకు అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో కామెడీ ట్రాక్ సన్నివేశాలు ఓ రేంజిలో అలరించనున్నట్లు టాక్. తన ప్రతి సినిమాలో డైరెక్టర్ పరశురామ్ ఆయన మార్క్ కామెడీతో ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. అలాగే ఈసారి సర్కారులో కూడా కమెడియన్స్ బ్రహ్మాజీ – వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్స్ కామెడీ ట్రాక్ సెకండ్ హాఫ్ లో హిల్లేరియస్ గా ఉండబోతుందని టాక్.
ఈ సినిమాలో మహేష్ బాబు చాలా సరదా క్యారెక్టర్ లో అలరించనున్నాడు. భారీ బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో మహేష్ స్టైలిష్ బ్యాంకు ఎంప్లాయిగా కనిపిస్తాడని గుసగుసలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ సరసన ఫస్ట్ టైం కీర్తిసురేష్ నటిస్తోంది. అసలే అమ్మాయిలకు ప్రిన్స్ అయినటువంటి మహేష్ జోడిగా.. యూత్ ఫేవరేట్ కీర్తి అనేసరికి ఫ్యాన్స్ ఓ రేంజిలో ఎక్సపెక్ట్ చేస్తున్నారు. మరి తెరపై ఈ క్రేజీ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇదిలా ఉండగా.. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. కాబట్టి ఆ రోజు మహేష్ సినిమా నుండి ఏదొక అప్డేట్ ఉంటుందని అందరికి తెలిసిందే.
మరి ఈసారి ఆ రోజున సర్కారు వారి పాట నుండి టీజర్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు. కానీ షూటింగ్ ఆ సగం కూడా పూర్తి కాలేదు కాబట్టి టీజర్ కు సరిపోయే పుటేజి లేదని టాక్. మరి ఎంతవరకు నిజమో కానీ టీజర్ కుదరకపోతే 30సెకండ్స్ గ్లింప్స్ లాంటిది ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఆ గ్లింప్స్ కూడా కుదరకపోతే కేవలం ఓ పోస్టర్ మాత్రమే రిలీజ్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి సినీవర్గాలు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ 14ప్లస్ రీల్స్ వారితో పాటుగా మహేష్ కూడా నిర్మిస్తున్నాడు. అలాగే తమన్ సంగీతం పై కూడా అంచనాకు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను వచ్చేఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.