మహేశ్ బాబు అంతే .. మనసు దోచేస్తాడు!

రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ రూపొందింది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా విడుదలకి సిద్ధమవుతోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. చరిత్రతో ముడిపడిన ఈ కథలో ఎన్టీఆర్ – చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇద్దరి అభిమానులు కూడా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాతో పాటు జనవరి 12వ తేదీన విడుదల కానున్న ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాడు.పాన్ ఇండియా సినిమాల పరిస్థితి అర్థం చేసుకుని పవన్ తన సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకున్నారు. అందుకు పవన్ కి రాజమౌళి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే మహేశ్ బాబుకి కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మహేశ్ బాబు – పరశురామ్ కాంబినేషన్లో ‘సర్కారువారి పాట’ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలు సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల చేయాలనుకున్నారు.

అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ కి పెద్ద మొత్తంలో థియేటర్స్ అవసరం పడతాయనే ఉద్దేశంతో మహేశ్ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నారు. తన సినిమాను ఏప్రిల్ కి వాయిదా వేసుకున్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని వ్యవహరించినందుకు రాజమౌళి ఆయనను అభినందించారు. సంక్రాంతి పండుగకు రావడానికి అవసరమైన అన్ని అంశాలు కలిగిన కథ ‘సర్కారువారి పాట’. సాధారణంగా అలాంటి సమయాన్ని .. సందర్భాన్ని ఎవరూ వదులుకోరు. అలాంటిది ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం మహేశ్ బాబు తన సినిమా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసుకున్నారు.

ఇండస్ట్రీలో ఒక స్నేహ పూర్వక వాతావరణాన్ని కల్పించడానికి తనవంతు ప్రయత్నం చేసిన ఆయనకి నేను థ్యాంక్స్ చెబుతున్నాను అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. అందుకు మహేశ్ బాబు స్పందిస్తూ . “నేను ఎప్పుడూ అదే చెబుతుంటాను .. ఒక మంచి పని కోసం మంచి నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవాలి. మీ సినిమాల ద్వారా మీరు ఆవిష్కరించే ప్రేమ .. స్నేహం అనే అంశాలు నాకు ఎంతగానో నచ్చుతాయి. అందరి మాదిరిగానే నేను కూడా ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను ” అని రాసుకొచ్చాడు.

రాజమౌళి కోసం మహేశ్ బాబు తన సినిమాను వాయిదా వేసుకోవడం ఇది రెండవసారి. గతంలో ‘బాహుబలి’ కోసం ఆయన ‘శ్రీమంతుడు’ సినిమాను వాయిదా వేసుకున్నారు. ఇక ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తికాగానే మహేశ్ సెట్స్ పైకి వెళ్లేది కూడా రాజమౌళి సినిమాతోనే. ఈ సినిమా కథ ఏమిటి? ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి అప్పుడే అభిమానుల్లో పెరిగిపోతోంది. ఇంతవరకూ ప్రభాస్ .. ఎన్టీఆర్ .. చరణ్ లకు రాజమౌళి తిరుగులేని విజయాలను అందించారు. అలాంటి ఒక బ్లాక్ బస్టర్ ను తమ హీరోకి అందించాలని మహేశ్ అభిమానులంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.