టాలీవుడ్ లో సూపర్ స్టార్ అనిపించుకున్న కృష్ణ ఫ్యామిలీ నుంచి ఆయన వారసుడిగా అడుగుపెట్టిన మహేశ్ బాబు అదే బిరుదుతో వారసత్వాన్ని కొనసాగించడం .. తండ్రికి తగిన తనయుడు అనిపించుకోవడం విశేషం. తన చిన్నప్పుడు తండ్రితో కలిసి షూటింగులకు వెళ్లడం వలన మహేశ్ బాబు తనకి తెలియకుండానే సినిమా వాతావరణానికి అలవాటు పడిపోయాడు. ఆ తరువాత తండ్రి ప్రోత్సాహంతో బాలనటుడిగా కెమెరా ముందుకు వచ్చాడు. కృష్ణ తనయుడిగా .. తమ్ముడిగా తెరపై కనిపించిన మహేశ్ బాబు ఆ తరువాత కాలంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘రాజకుమారుడు’ సినిమాతో ఆయన హీరోగా తెలుగు తెరకి పరిచయమయ్యాడు. ఆ తరువాత చేసిన ‘మురారి’ సినిమా ఆయనకి హిట్ తో పాటు మంచి పేరు తెచ్చిపెట్టింది. హీరోగా తనకి ఏ జోనర్ సెట్ అవుతుంది? మిగతా హీరోలకి భిన్నమైన రూట్లో తాను వెళ్లాలంటే ఏం చేయాలి? అనే ఆలోచనలో ఉండగానే చకచకా ఫ్లాపులు పడిపోయాయి. ఆ తరువాత కాస్త తేరుకుని ఆయన చేసిన ‘ఒక్కడు’ .. ‘అర్జున్’ .. ‘అతడు’ .. ‘పోకిరి’ సినిమాలతో మహేశ్ బాబుకి తన కెరియర్ పై ఒక క్లారిటీ వచ్చింది.
అయితే ఆ తరహా కథలను మహేశ్ బాబు సెట్ చేసుకునేలోగా మళ్లీ మూడు ఫ్లాపులు వరుసగా పలకరించాయి. ఇక ఈ సమయంలోనే కుదురుకోవడానికి మహేశ్ కేర్ తీసుకున్నాడు.
కథల ఎంపిక విషయంలో ఎంతమాత్రం తొందరపడకుండా .. దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచన చేస్తూ ఆయన అడుగులు వేయడం మొదలుపెట్టాడు. అందువల్లనే ‘దూకుడు’ .. ‘బిజినెస్ మేన్’ .. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఇక అక్కడి నుంచి సాధ్యమైనంతవరకూ ఫ్లాపుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఆయన ముందుకు వెళుతున్నాడు.
‘శ్రీమంతుడు’ .. ‘భరత్ అనే నేను’ .. ‘మహర్షి’ .. ‘సరిలేరు నీకెవ్వరు’ .. ‘ సర్కారువారి పాట’ వంటి వైవిధ్యభరితమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ .. సంచలన విజయాలను అందుకుంటూ సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన తన 28వ సినిమాను త్రివిక్రమ్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు.
వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఆ తరువాత ప్రాజెక్టును ఆయన రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నాడు. హీరోగా తన కెరియర్ ను మొదలెట్టి 20 ఏళ్లు దాటినా అప్పటికీ .. ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తున్నాడు. అంచలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు. అలాంటి మహేశ్ బాబు బర్త్ డే ఈ రోజు. ఈ సందర్భంగా ఆయనకి విషెస్ తెలియజేస్తూ మరిన్ని విజయాలను అందుకోవాలని మనసారా కోరుకుందాం!