ప్రేక్షకులకు సర్కారు వారి విజ్ఞప్తి..!

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ గత రెండున్నరేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ”సర్కారు వారి పాట” థియేటర్లలోకి వచ్చేసింది. ఈరోజు నుంచే ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వసూళ్లను రికవరీ చేయడం మొదలుపెట్టింది. అయితే సినిమా చూసిన వాళ్ళు కొన్ని సీన్స్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండటంతో.. చిత్ర బృందం ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి చేసింది.

‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబంధించిన ఎలాంటి ఫొటోలు – వీడియోలను చిత్రీకరించి ఇంటర్నెట్ లో పోస్ట్ చేయవద్దని మేకర్స్ కోరారు. అలాగే ఎవరైనా ఎక్కడైనా ఈ సినిమా పైరసీకి పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే యాంటీ పైరసీ కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలని విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు claims@antipiracysolutions.org అనే ఈమెయిల్ ఐడీతో పాటుగా 8978650014 – 9912425159 – 8881108888 వంటి మూడు వాట్సాప్ నంబర్లను SVP టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇకపోతే ‘సర్కారు వారి పాట’ సినిమా ఫస్ట్ డే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే మేకర్స్ మాత్రం ఇది సమ్మర్ సెన్సేషనల్ మాస్ బ్లాక్ బస్టర్ అని పేర్కొంటున్నారు. వీకెండ్ లో ఈ సినిమా వసూలు చేసే కలెక్షన్స్ ను బట్టి ఇది ఏ రేంజ్ హిట్ అనేది తెలుస్తుంది.

కాగా ‘సర్కారు వారి పాట’ చిత్రానికి పరశురాం పెట్లా దర్శకత్వం వహించారు. ఇందులో మహేశ్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సముద్ర ఖని – నదియా – వెన్నెల కిషోర్ – సౌమ్య మీనన్ – సుబ్బరాజు – అజయ్ – బ్రహ్మాజీ – తనికెళ్ల భరణి – పోసాని కృష్ణ మురళి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. ఆర్. మది సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు.

సర్కారు వారి పాట చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నవీన్ యెర్నేని – వై. రవిశంకర్ – రామ్ ఆచంట – గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించారు.