ముందుంది మమతా బెనర్జీకి ముసళ్ళ పండగ.!

తాను ఓడినా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఒంటి చేత్తో విజయాన్ని అందించారు ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో శాసన మండలి లేదు గనుక, ముఖ్యమంత్రిగా ఇంకోసారి పదవీ ప్రమాణ స్వీకారం చేయబోయే మమతా బెనర్జీ, ఖచ్చితంగా అసెంబ్లీకి ఆరు నెలల్లోగా ఎన్నికవ్వాల్సిందే.

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ప్రస్తుతం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా వున్నాయి. అందులో ఒక సీటుని తృణమూల్ కాంగ్రెస్ గెలిచినప్పటికీ, అభ్యర్థి కరోనా నేపథ్యంలో ఎన్నికల సమయంలోనే ప్రాణాలు కోల్పోయారు. అక్కడి నుంచి మమతా బెనర్జీ పోటీ చేస్తారా.? లేదంటే, చనిపోయిన అభ్యర్థి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పిస్తారా.? అన్నదానిపై స్పష్టత లేదు.

సరే, మమత కోరుకుంటే, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎవరో ఒకరు తమ సీటుని త్యాగం చేయడం పెద్ద విషయమేమీ కాదనుకోండి.. అది వేరే సంగతి. ఆ విషయాన్ని పక్కన పెడితే, మరోసారి ముఖ్యమంత్రి పీఠమెక్కనున్న మమతా బెనర్జీ ముందు చాలా సవాళ్ళున్నాయి. ప్రతిపక్షం బీజేపీని ఎదుర్కోవడమే ఆమెకు పెద్ద సవాల్. గతంలో సింగిల్ డిజిట్ సీట్లు మాత్రమే సాధించిన బీజేపీ, ఈసారి చెప్పుకోదగ్గ సీట్లు సాధించింది. దాంతో, అసెంబ్లీలో ఆమెకు ఏదీ అంత ఈజీ కాదు.

మరోపక్క, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అల్లర్లు చోటుచేసుకుంటున్నాయి. ముస్లింలు, హిందువులపై దాడులు చేస్తున్నారంటూ బీజేపీ రాజకీయ నాటకాన్ని రక్తికట్టిస్తోంది. నిజానికి అక్కడ జరుగుతున్న గొడవలు అధికార పార్టీకీ, ప్రతిపక్షానికీ మధ్య మాత్రమే. వీటికి మతం రంగు పులిమి, రాజకీయ లబ్ది పొందాలనుకుంటోంది బీజేపీ. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి వీలైనంత ఎక్కువమంది ఎమ్మెల్యేలను వీలైనంత త్వరగా లాగెయ్యాలని మమతా బెనర్జీ చూస్తున్నారట. సగానికి సగం మంది బీజేపీ ఎమ్మెల్యేలు, అతి త్వరలో మమత పార్టీలో చేరబోతున్నారంటూ అప్పుడే బెంగాల్ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది.

మరోపక్క, మమత ముఖ్యమంత్రి అవకుండా చేసేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్ బీజేపీ నుంచి గట్టిగా వినిపిస్తోంది. కేంద్రంలో అధికారం తమదే గనుక, బీజేపీ.. అన్నంత పనీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Share