‘మా’ బిల్డింగ్‌ సొంత డబ్బుతో నేను నిర్మిస్తా.. ఏకగ్రీవంగా ఎన్నుకోండి: మంచు విష్ణు

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఇప్పటికే ప్రకాష్‌ రాజ్‌.. మంచు విష్ణు ఇంకా కొందరు మా ఎన్నికల బరిలో నిలబడబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలని కొందరు కోరుకుంటూ ఉన్నారు. ఇక పోటీకి దిగుతున్న ప్రతి ఒక్కరు కూడా మా అసోషియేషన్‌ భవన నిర్మాణం చేపడుతాం అంటూ ప్రకటించారు. కాని మంచు విష్ణు మాత్రం మొత్తం తన ఖర్చుతో మా భవనంను నిర్మిస్తాను అంటూ ప్రకటించాడు. మా భవనం కోసం ఖర్చు అయ్యే ప్రతి పైసా ను నేను చెల్లిస్తాను.. ఇక్కడితో ఆ విషయం గురించి మర్చి పోండి అంటూ విష్ణు ప్రకటించాడు.

ఇక మా పెద్దలు అయిన కృష్ణ, కృష్ణం రాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ మా నాన్న గారు ఇంకా ప్రముఖులు అంతా కలిసి ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ముందుకు వస్తే నేను సిద్దం. వారు అంతా కూడా ఎవరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వారికి నా మద్దతు ఉంటుంది. వారు ఏకగ్రీవంగా ప్రెసిడెంట్‌ ను నిలపలేక పోతే నేను పోటీకి దిగుతాను అంటూ మంచు విష్ణు ప్రకటించాడు. దీంతో ప్రతి ఒక్కరు కూడా మంచు విష్ణు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిందిగా తీర్మానించే అవకాశం ఉంది. ప్రతి పైసా కూడా మంచు ఫ్యామిలీ ఇస్తానంటే అందుకు ఇండస్ట్రీ పెద్దలు ఒప్పుకుంటారా అనేది కూడా చూడాలి.