పర్సనల్ లైఫ్ అంటూనే.. ఆ హీరో ప్రత్యేకమని చెప్పేసింది

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు.. అవి కాస్తా పెళ్లిళ్లుగా మారటం కొత్తేం కాదు. ఒక ప్రేమ కథకు మరో ప్రేమకథకు పొంతన లేనట్లే.. తారల ప్రేమాయణాలు ఒక్కొక్కరివి ఒక్కోలా ఉంటాయి. ఇప్పుడు చెప్పే ముద్దుగుమ్మ ప్రేమకథ కూడా ఆ కోవలోకే చెందింది. బాలనటిగా పరిచయమై.. హీరోయిన్ గా పలు బాషల్లో సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ మంజిమా మోహన్. మలయాళం.. తమిళం.. తెలుగు ఇలా భాష ఏదైనా భావం ఒక్కటే అన్న రీతిలో ఆమె వరుస పెట్టి సినిమా చేస్తున్నారు. తాజాగా ఆమె ప్రముఖ సినీ నటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్ కార్తీక్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారన్న వార్తలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి.

2019లో వీరిద్దరితో వచ్చిన సినిమా సందర్భంలో జరిగిన పరిచయం.. మరింత ముందుకు వెళ్లినట్లు చెబుతారు. కోలీవుడ్ ప్రేమకథల్లో వీరి గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఈ మధ్యనే చెన్నైలోని ఒక ఇంట్లో సహజీవనం చేస్తున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని చెబుతారు. ఇలాంటివేళ.. ఒక చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె బోలెడన్ని విషయాల్ని చెప్పుకొచ్చారు.

గౌతమ్ కార్తీక్ అంటే తనకు ఇష్టమని.. తాను అతడి ప్రేమను అంగీకరించలేదని చెప్పారు. నటీనటులకు వ్యక్తిగత జీవితం అంటూ ఒకటి ఉంటుందని.. ప్రొఫెషనల్ లైఫ్ గురించి అన్ని విషయాలు పంచుకోగలం కానీ.. వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచటం తనకు ఇష్టమన్నారు. తన ప్రైవేట్ లైఫ్ ను అందరితో పంచుకోవటం తనకు ఇష్టం లేదన్నారు. గౌతమ్ కార్తీక్ కు నాకు త్వరలోనే పెళ్లి అని కథనాలు వచ్చాయని.. మొదట్లో ఈ వార్తల్ని చూసి తమ తల్లిదండ్రులు ఎంతో బాధ పడినట్లుచెప్పింది. ఇప్పుడు మాత్రం నవ్వుకుంటున్నారన్నారు.

తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం లేదని.. అందుకు మరికాస్త సమయం ఉందన్న ఆమె.. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటపెడతానని చెప్పారు. గౌతమ్ నిజాయితీగా ఉండే వ్యక్తి అని.. తనకు ప్రత్యేకమని చెప్పుకొచ్చింది. ”అతను మా ఇంట్లో అందరికి తెలుసు. అతనితో ఉండే సేఫ్ గా .. సంతోషంగా ఉంటాననే భావన కలుగుతుంది” అని చెప్పిన ఆమె.. ప్రేమ గురించి చెప్పలేదు కానీ చాలానే విషయాల్ని చెప్పేసిందని చెప్పక తప్పదు.