ఎమ్మెల్యే రోజాకు రెండు సర్జరీలు

ఏపీ అధికార పార్టీకి చెందని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు రెండు సర్జరీలు చేశారు. ఈ విషయాన్ని రోజా భర్త సెల్వమణి వెల్లడించారు. రోజాకు రెండు మేజర్ సర్జరీలు జరిగాయని, ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని తెలిపారు. ఈ మేరకు ఓ ఆడియో టేపు విడుదల చేశారు. శస్త్రకిచికత్సలు పూర్తి చేసిన తర్వాత సోమవారం ఆమెను ఐసీయూ నుంచి వార్డుకు తరలించారని వివరించారు.

మరో రెండు వారాలు రోజా విశ్రాంతి తీసుకుంటారని తెలిపారు. వాస్తవానికి ఈ ఆపరేషన్లు గతేడాదే చేయాల్సి ఉందని.. అయితే, కరోనా, స్థానిక ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం రోజా బాగానే ఉన్నారని.. ఆమె ఆరోగ్యం కుదుటపడుతోందని సెల్వమణి చెప్పారు. ఆమెను చూసేందుకు సందర్శకులు ఎవరూ ఆస్పత్రికి రావొద్దని సూచించారు. అయితే, రోజా ఏ ఆపరేషన్లు చేయించుకున్నారనేది సెల్వమణి వెల్లడించలేదు.