కృషి .. పట్టుదల కలిస్తే మురళీమోహన్ (బర్త్ డే స్పెషల్)

ఒకప్పుడు హీరో అంటే ఇలా ఉండాలి అంటూ కొన్ని కొలతలు .. లెక్కలు ఉండేవి. అందువలన హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కష్టం. ఇక ఎంట్రీ ఇచ్చిన తరువాత నిలదొక్కుకోవడం మరింత కష్టం. అలాంటి అవాంతరాలను అధిగమించిన కథానాయకుడిగా మురళీమోహన్ కనిపిస్తారు. మురళీమోహన్ ఇంటిపేరు మాగంటి .. అసలు పేరు ‘రాజబాబు’. సినిమాల్లోకి వచ్చిన తరువాత పేరు మార్చుకున్నారు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకుంటూ వెళ్లారు. కృషి .. పట్టుదలను తోడుగా చేసుకుని ధైర్యంగా ఆయన వేసిన అడుగులు .. విజయాల తీరం వైపే సాగాయి.

ఒకా వైపున యాక్షన్ హీరోగా కృష్ణ .. మరో వైపున రొమాంటిక్ హీరోగా శోభన్ బాబు దూసుకుపోతున్నారు. ఇంకో వైపున రెబల్ పాత్రలకి పెట్టింది పేరుగా కృష్ణంరాజు ఎదుగుతున్నారు. ఇక తాను ఎంచుకున్న జోనర్ కి దగ్గరగా వరుస సినిమాలు చేస్తూ చంద్రమోహన్ ఉండనే ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కథనాయకుడిగా ప్రయత్నించడానికే ధైర్యం కావాలి. అవకాశం వచ్చిన తరువాత తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడే మురళీమోహన్ సక్సెస్ అయ్యారు. తనకంటూ ఒక బాడీ లాంగ్వేజ్ ను .. డైలాగ్ డెలివరీని సెట్ చేసుకుని ముందుకు కదిలారు.

అలా ఆయన చేసిన సినిమాల్లో ‘వారాలబ్బాయి’ .. ‘రామదండు’ .. ‘అద్దాలమేడ’ .. ‘పిచ్చి పంతులు’ .. ‘జ్యోతి’ .. ‘కల్పన’ వంటి సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. తనకంటూ కొంతమంది అభిమానులను మురళీమోహన్ సంపాదించుకున్నారు. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్ట్ గాను బిజీ అయ్యారు. నటుడిగా 300 సినిమాలకి పైగా చేసిన ఆయన ‘జయభేరి ఆర్ట్స్’ పేరుతో సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని తన అభిరుచికి తగిన సినిమాలను నిర్మించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగాను విజయాలను అందుకున్నారు. రాజకీయాలలోను తనదైన ముద్రను చూపించారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు .. ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.