దీపావళికి ‘వకీల్ సాబ్’ టపాసు రెడీ అవుతుందా?


పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘వకీల్ సాబ్’ టీజర్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే సినిమా టీజర్ గురించి ప్రచారం జరిగింది. కాని టీజర్ విడుదలకు కరోనా అడ్డు తగిలింది. కరోనా వల్ల ఎనిమిది నెలల పాటు షూటింగ్ కు దూరంగా ఉన్న పవన్ ఎట్టకేలకు ఇటీవలే షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈ నెల చివరి వరకు షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాను అంతా సరిగా ఉంటే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే సినిమా టీజర్ ను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం థమన్ ఆధ్వర్యంలో వకీల్ సాబ్ కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. పాటలు ఎక్కువగా ఉండని ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ కీలకంగా ఉండబోతుంది. ఇక తాజాగా థమన్ ట్వీట్ చేసిన ఫొటోలు టీజర్ కోసం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సిట్టింగ్స్ అంటున్నారు. మొత్తానికి వకీల్ సాబ్ సినిమా టీజర్ ను దీపావళికి తీసుకు వచ్చే అవకాశం ఉంది అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ మినహా మరేది అధికారికంగా విడుదల కాలేదు. దీపావళికి టీజర్ ను విడుదల చేయడం వల్ల అంచనాలు మరింతగా పెంచాలని భావిస్తున్నారు.