నిజంగానే పగిలిపోయే వార్త ఇది. అదేనండీ బ్రేకింగ్ న్యూస్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి. రమణ నియమితులవబోతున్నారు. ఈ మేరకు ప్రస్తుత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే, కేంద్ర న్యాయ శాఖకు జస్టిస్ ఎన్.వి. రమణ పేరుని తదుపరి చీఫ్ జస్టిస్ పదవి కోసం ప్రతిపాదిస్తూ లేఖ రాశారు.
సీనియార్టీ ప్రకారం చూసుకుంటే జస్టిస్ ఎన్.వి. రమణ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులవుతారని గతంలోనే ప్రచారం జరిగింది. అయితే, వైసీపీ అధినేత.. ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జస్టిస్ ఎన్.వి. రమణపై పలు రకాల ఆరోపణలు చేస్తూ ఇటీవల చీఫ్ జస్టిస్ బాబ్డేకి రాసిన లేఖతో పెను దుమారం రేగింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ జస్టిస్ ఎన్.వి. రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాకుండా చేయాలని కుట్ర జరిగిందంటూ ఏపీ రాజకీయాల్లో పెద్దయెత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇంతకీ, జస్టిస్ ఎన్.వి. రమణ విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదుని చీఫ్ జస్టిస్ బాబ్డే అంతర్గతంగా విచారించారా.? విచారించాక క్లీన్ చిట్ ఇచ్చి మరీ, ఆయన పేరుని తదుపరి చీఫ్ జస్టిస్ పదవి కోసం ప్రతిపాదించారా.? అన్న విషయమై రకరకాల అభిప్రాయాలు మీడియా, రాజకీయ వర్గాలతోపాటు న్యాయ వర్గాల్లోనూ వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో తీర్పులు రావడం పట్ల అసహనం వ్యక్తం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, తన అనుమానాల్ని ఓ లేఖలో పొందుపర్చి, చీఫ్ జస్టిస్‌కి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఆయా కేసుల విచారణ సందర్బంగా బెంచ్‌లు మారడం సహా అనేక అంశాలపై ఫిర్యాదు చేశారు వైఎస్ జగన్. ప్రతి అంశానికీ రాజకీయంతో ముడిపెట్టడంతోనే వ్యవస్థలు నిర్వీర్యమయిపోయే పరిస్థతి వస్తోందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు.
ఇక, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే ప్రతిపాదన తర్వాత, తదుపరి చీఫ్ జస్టిస్‌గా ఎన్.వి. రమణ నియామకం దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది. ఏప్రిల్ 23న చీఫ్ జస్టిస్ బాబ్డే పదవీ విరమణ చేయబోతున్నారు.. ఆ స్థానంలో నూతపాటి వెంకటరమణ (ఎన్.వి. రమణ) కొత్త చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. 2022 ఆగస్టు వరకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్.వి. రమణ కొనసాగుతారు.