లోకేశం ఆవేశం.. ఈసారి పీక్స్‌కి చేరిన ‘సరసం’.!

పైకి ఏం మాట్లాడినా, తెరవెనుకాల ’60-40′ ఒప్పందాల వ్యవహారం అందరికీ కన్పిస్తూనే వుంది టీడీపీ – వైసీపీ విషయంలో. పార్టీ ఫిరాయించేసిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ఎందుకు ‘అనర్హత వేటు’ వేయడంలేదు.? అసెంబ్లీ సాక్షిగా, ‘నేను నిప్పు.. నా జమానాలో పార్టీ ఫిరాయింపుల్ని ఉపేక్షించేదే లేదు.. పార్టీ మారితే, వెంటనే అనర్హత వేటు పడటమే..’ అంటూ చంద్రబాబుని మించి ప్రగల్భాలు పలికేసిన వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, పార్టీ మారిన నేతల పుత్ర రత్నాలకు వైసీపీ కండువాలు కప్పుతూ కొత్త ట్రెండ్‌కి తెరలేపారు.

అమరావతిలో అవినీతి, ఇసుకలో అవినీతి.. అంటూ వైఎస్‌ జగన్‌, ప్రతిపక్ష నేత హోదాలో అప్పటి టీడీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ‘మేం అధికారంలోకి వచ్చిన వెంటనే, చంద్రబాబుని జైలుకు పంపిస్తాం..’ అని అప్పట్లో నినదించారు వైఎస్‌ జగన్‌. ఏదీ.? ఎక్కడ.!

టీడీపీ హయాంలో జగన్‌ని జైలుకు పంపలేకపోయారు.. వైసీపీ హయాంలో టీడీపీ విషయంలో జరుగుతున్నదీ అదే హైడ్రామా. ఈ మధ్య ‘సత్య ప్రమాణాల’ ట్రెండ్‌ తెరపైకొచ్చింది. రెండు పార్టీల్నీ ప్రజలు విశ్వసించడంలేదని బహుశా.. ఇరు పార్టీల పెద్దలూ ఓ నిర్ణయానికొచ్చినట్లున్నారు. కలిసి కట్టుగా ‘సత్య ప్రమాణాల’ నాటకమాడుతున్నారు. ఈ లిస్ట్‌లోకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేరిపోయారు.

విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలో రాములోరి విగ్రహాన్ని దుండుగలు ధ్వంసం చేస్తే, అది అధికార పార్టీ పనేనని టీడీపీ ఆరోపించింది. కాదు కాదు, అది చంద్రబాబు కుట్ర.. అని వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ‘బస్తీ మే సవాల్‌..’ సింహాచలం అప్పన్న సాక్షిగా తేల్చేసుకుందాం.. ‘సత్య ప్రమాణానికి’ సిద్ధమా.? అంటూ నారా లోకేష్‌, ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి సవాల్‌ విసిరేశారు.

కొద్ది రోజుల క్రితమే టీడీపీ ఎమ్మెల్యే సవాల్‌ విసిరితే, విజయసాయిరెడ్డి పారిపోయారు. విజయసాయిరెడ్డికి బదులు వైసీపీ ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు. మరి, ఇప్పుడు ఏం జరుగుతుంది.? వైఎస్‌ జగన్‌ వస్తారా.? ‘నీకు వైఎస్‌ జగన్‌ ఎందుకు.? నీ స్థాయికి మేం చాలు..’ అంటూ మళ్ళీ ఆ వైసీపీ గ్యాంగ్‌ ‘జబ్బలు చరుచుకుని, తొడలు కొట్టేసుకుని’ రంగంలోకి దిగుతారా.?

ఏమోగానీ, రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం మధ్య రాజకీయ ‘సరసం’ ముదిరి పాకాన పడింది. ఇది చూడ్డానికి చాలా అసహ్యంగా మారింది.