గత కొద్ది రోజులుగా కనీ వినీ ఎరుగని రీతిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నారు. జాంబీ రెడ్డి అనీ, జగరోనా అనీ.. ఇలా రకరకాల పేర్లు పెడుతున్నారు నారా లోకేష్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. అయినా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుంచి నారా లోకేష్ వైపుకి విమర్శలు రావడంలేదు. ‘నేను ముఖ్యమంత్రిని.. నా స్థాయి వేరు..’ అని జగన్ అనుకుంటున్నారా.? ఏమోగానీ, నారా లోకేష్ సంధిస్తున్న విమర్శలు, విసురుతున్న సవాళ్ళు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
మొన్నటికి మొన్న తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో, ‘హూ కిల్డ్ బాబాయ్..’ అంటూ నారా లోకేష్ విసిరిన సవాల్ దెబ్బకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తిరుపతి ఉప ఎన్నిక ప్రచారాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని టీడీపీ శ్రేణులంటున్నాయి. ఇదిలా వుంటే, సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ మరింత జోరు పెంచుతున్నారు. ‘జగన్ రెడ్డి వేసే 5 రూపాయల ముష్టి కోసం ఎంతకైనా దిగజారుతాయి పేటీఎం కుక్కలు. మీ నాయకుడి దగ్గర సరుకు లేదు. ఇక మీ బతుకులు ఫేక్ ట్వీట్లు వేసుకుని సంబరపడటమే..’ అంటూ నారా లోకేష్, ఓ ఫేక్ ట్వీట్ మీద సంధిస్తూ ఒకేసారి వైసీపీ కార్యకర్తల్ని, వైసీపీ అధినేతనీ టార్గెట్ చేశారు. దీనికి సమాధానం ఇవ్వలేని పరిస్థితి వైసీపీ నేతలకు, కార్యకర్తలకు వచ్చినట్లే కనిపిస్తోంది.
కావాలనే నారా లోకేష్ మీద పాజిటివ్ ఇమేజ్ కోసం వైసీపీ ఇలా మౌనం దాల్చుతోందా.? ‘పప్పు లోకేష్’ అనే విమర్శలన ఎదుర్కొన్న స్థాయి నుంచి, జగన్ సర్కారుని నిలదీస్తోన్న యువ నేత.. అనే స్థాయికి లోకేష్ ఎదగడం వెనుక వైసీపీ అసమర్థతే కారణమా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇక, లోకేష్ మీద విజయసాయిరెడ్డి లాంటోళ్ళో, ఇంకొకరో వేసే సెటైర్లు, తిరిగి వైసీపీకే గట్టిగా తగులుతుండడం గమనార్హమిక్కడ.