ఖరీదైన ఫ్లాట్ .. కళ్లు చెదిరే ఫ్లాట్ కొనేసిన నయన్!


అందం .. ఆకర్షణ .. అభినయం .. అదృష్టం .. వీటన్నింటి కలబోతగా నయనతార కనిపిస్తుంది. వెండితెరపై నయన్ ను చూసినప్పుడు బాగానే ఉంది .. గ్లామర్ పరంగా కొన్ని సినిమాల వరకూ నెట్టుకు రాగలదని చాలామంది అనుకున్నారు. వాళ్లు అనుకున్నట్టుగానే నయనతార గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్లింది. అలా తెలుగు .. తమిళ భాషల్లో ఆమె వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. అదృష్టం బాగుండటంతో మంచి పాత్రలు .. వరుస హిట్లు పడుతూ వచ్చాయి. దాంతో చాలా తక్కువ సమయంలో ఆమె స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది.

ఇక ఇదే సమయంలో ఆమె నాయిక ప్రధానమైన సినిమాలు చేస్తూ వెళ్లడం మొదలుపెట్టింది. అలా ఆమె చేసిన సినిమాలు .. స్టార్ హీరోల సినిమాలతో సమానమైన వసూళ్లను రాబట్టాయి. తమిళంలో ఆమె లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిపోయింది. సౌత్ తో అత్యధిక పారితోషికం అందుకునే నాయికగా తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమలో పడింది. ప్రేమలో పడగానే చాలామంది కెరియర్ ను పట్టించుకోరు. కానీ నయనతార తన స్థానాన్ని పటిష్ఠం చేసుకుంటూ తన ప్రేమ .. తన కెరియర్ కి అడ్డురాకుండా చూసుకుంది.

విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో పడినప్పుడు కూడా ఆమె ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. అయితే ఎప్పుడూ కూడా ఆమె ఎవరికీ సంజాయిషీలు ఇచ్చే ప్రోగ్రామ్ లు పెట్టుకోలేదు. తనని పని తాను సిన్సియర్ గా చేసుకుంటూ వెళుతుంటుంది. ఈ మధ్యనే విఘ్నేశ్ శివన్ తో ఆమెకి నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వాళ్ల వివాహం జరగనుంది. ఇద్దరూ కలిసి ఉండటం కోసం నయనతార ఒక ఖరీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేసిందని చెబుతున్నారు. చెన్నైలో అత్యంత ధనికులు మాత్రమే నివసించే ‘పోయెస్ గార్డెన్’లో ఆమె ఫోర్ బెడ్ రూమ్ ఫ్లాట్ ను కొనుగోలు చేసిందని అంటున్నారు.

కోట్ల రూపాయల ఖరీదు చేసే ఈ ఫ్లాట్ రేటు పరంగా కళ్లు తిరిగిపోయేలా .. విలాసాల పరంగా కళ్లు చెదిరిపోయేలా ఉంటుందట. ఎలాంటి అండదండలు లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన నయనతార ఈ స్థాయికి చేరుకోవడం సుదీర్ఘ కాలం పాటు దానిని నిలబెట్టుకోవడం .. ఇంతటి ఖరీదైన నివాసాన్ని సంపాదించుకోగలగడం నిజంగా విశేషమే. ప్రస్తుతం వరుస తమిళ సినిమాలు చేస్తున్న ఆమె తెలుగు .. మలయాళ ప్రాజెక్టులను కూడా లైన్లో పెట్టింది. బాలీవుడ్ కి కూడా పరిచయమయ్యే పనిలో ఉంది.