పుత్తడి బొమ్మను తలపిస్తున్న మెగా ప్రిన్సెస్ నిహారిక

మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల వివాహం ప్రస్తుతం ట్రెండీ టాపిక్. ఐజీ ఆఫీసర్ కుమారుడు చైతన్య జొన్నలగడ్డను నిహారిక పెళ్లాడుతోంది. డిసెంబర్ 9న రాజస్థాన్ ఉదయ్ పూర్ టౌన్ లో ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఈ జంట వివాహానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.

ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ పీక్స్ కి చేరుకున్నాయి. మరో నాలుగు రోజులే సమయం మిగిలి ఉంది. కొద్దిమంది బంధుమిత్రులు ఇండస్ట్రీ ప్రముఖుల సమక్షంలో ఈ వివాహం వైభవంగా జరగనుంది. ఈ పెళ్లికి వరుణ్ తేజ్ అన్నీ తానే అయ్యి దగ్గరుండి చూసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ – నాగబాబు పర్యవేక్షకులుగా ఉన్నారు. చిరు ఈ వివాహానికి రావడం కోసం ఆచార్య షూటింగ్ కి బ్రేక్ ఇస్తున్నారు.

ఇక కాబోయే వధువు నిహారిక కొణిదెల తన కజిన్స్ ఫ్రెండ్స్ తో కలిసి చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇప్పటికే అంతర్జాలంలో అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా నిహారిక ప్రీవెడ్డింగ్ వేడుకల్లో భాగంగా పెళ్లి కూతురుగా ముస్తాబుకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో కి విడుదలయ్యాయి.

డార్క్ చిలుకాకు పచ్చ వంగ పువ్వు రంగు కాంబినేషన్ పట్టు చీరలో చిరునవ్వులు చిందిస్తున్న నిహారిక పుత్తడి బొమ్మనే తలపిస్తోంది. ఇక ఆ చీర అంచుకు కాంబినేషన్ గా చెవులకు జూకాలు ఎంపిక చేసుకున్న నీహారిక అందం పదింతలైంది. మెగాప్రిన్సెస్ స్మైల్ తోనే కోటి దీపాల కాంతుల్ని విస్తరించింది ఆ పరిసరాల్లో. ఇటీవల నాగబాబు ఇంట్లో జరిగిన కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.