తెలుగుదేశం పార్టీకి సంకటంగా మారుతున్న జూ.ఎన్టీఆర్.!

సినీ నటుడు జూనియర్ తారకరామారావు (జూ.ఎన్టీఆర్), తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి కొత్త తలనొప్పి తెచ్చిపెడుతున్నాడు. నిజానికి, ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రమేయం ఏమీ లేదు. చంద్రబాబు తన సొంత జిల్లా చిత్తూరుకి వెళ్ళిన సందర్భంలో, సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ కార్యకర్తలే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ జపం చేశారు. ఎన్నికల్లో ప్రచారం కోసం జూ.ఎన్టీఆర్‌ని తీసుకురావాలన్నది కార్యకర్తల డిమాండ్. గతంలో ఎన్నికల ప్రచారం కోసం జూ.ఎన్టీఆర్‌ని చంద్రబాబు వాడుకుని వదిలేసిన వైనం అందరికీ తెలిసిందే. నందమూరి కుటుంబానికి చంద్రబాబు వెన్నుపోట్లు జగమెరిగిన సత్యం.

అయినా, మళ్ళీ మళ్ళీ నందమూరి కుటుంబ సభ్యులు చంద్రబాబు ట్రాప్‌లో పడుతూనే వుంటారనుకోండి.. అది వేరే సంగతి. టీడీపీ ఇంతలా భ్రష్టు పట్టిపోతున్నా.. ఆ భ్రష్టత్వానికి కారణం నారా లోకేష్ అనే ఆరోపణలు వెల్లువెత్తతున్నా పుత్రరత్నం నారా లోకేష్ మీద చంద్రబాబుకి ప్రేమ ఇసుమంతైనా తగ్గడంలేదు.. తగ్గదు కూడా. పార్టీ ప్రయోజనాల కన్న పుత్ర వాత్సల్యంపైనే చంద్రబాబుకి మక్కువ ఎక్కువ. ఈ క్రమంలోనే టీడీపీ రోజురోజుకీ మరింత దిగజారిపోతోంది. ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే టీడీపీని పైకి లేపగలడన్నది కొందరు టీడీపీ నేతల ఉవాచ. ఇదే అభిప్రాయం, చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా వినిపిస్తుండం గమనార్హం.

పంచాయితీ ఎన్నికల్లో కుప్పం ఓటర్లు, తెలుగుదేశం పార్టీకి షాకిచ్చి వైసీపీకి పట్టం కట్టిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బతికి బట్టకట్టాలంటే అది ఎన్టీఆర్‌తోనే సాధ్యమవుతుందని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. కానీ, చంద్రబాబుకి బాగా తెలుసు.. ఇలాంటి డిమాండ్లను ఎలా తొక్కి పెట్టెయ్యాలో. రాజకీయంగా తన ఉనికికే ప్రమాదం ఏర్పుడుతున్నా, చంద్రబాబు తన పంథా మార్చుకోకపోవడం ఆశ్చర్యకరం. ఔను, ఆయన మారరు.. మారరుగాక మారరు. మారానని చెబుతుంటారంతే.

Share