ప్రతిష్ఠాత్మక #NTR30 చిత్రీకరణకు సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. 2021 డిసెంబర్ నుండి ఎన్టీఆర్- కొరటాల శివ సినిమా గురించి చర్చలు సాగుతూనే ఉన్నాయి. 2022 మేలో తారక్ పుట్టినరోజు సందర్భంగా సినిమాని అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత చాలా కాలంగా సినిమా ప్రారంభం కాలేదు. దీనికి కారణం కథానాయిక సెర్చ్ సహా ఇతర కాస్టింగ్ ఎంపికలు కూడా ఆలస్యమవ్వడమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాలో నటింపజేసేందుకు ఇండస్ట్రీ అగ్ర హీరోయిన్లను సంప్రదించారని టాక్ వినిపించింది. ఇంతకుముందు కియారా అద్వాణీ పేరు వినిపించినా ఆ భామ శంకర్ తో ఆర్.సి 15 కి కమిటైంది. అదే క్రమంలో జాన్వీ కపూర్ పేరు కూడా మధ్యలో వినిపించింది.
ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ కొనసాగుతున్న క్రమంలోనే ఆలియా భట్ పేరు కూడా ప్రముఖంగానే చర్చకొచ్చింది. కానీ ఆలియా ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అదే క్రమంలో శ్రీలీల-కృతి శెట్టి అంటూ యంగ్ బ్యూటీస్ పేర్లు కూడా వినిపించాయి. కానీ వీళ్లెవరినీ కొరటాల ఎంపిక చేయలేదని సమాచారం.
ప్రస్తుతం ఎన్టీఆర్ 30లో నటించే భామ ఒక పాన్ ఇండియా స్టార్ అయ్యి ఉండాలని భావిస్తున్నారట. అంటే ఆలియాకు ఆల్టర్నేట్ గా మంచి ఇమేజ్ ఉన్న కథానాయిక కావాలని భావిస్తున్నారు. ఆ ఛాయిస్ అందాల సమంతకు ఉందని కూడా టీమ్ భావిస్తోందట. సమంతకు దర్శకనిర్మాతలు టచ్ లో ఉన్నారు. ఒప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయట. కానీ ఇంకా సామ్ సంతకం చేయలేదు.
ఎన్టీఆర్ తో సమంతకు బ్లాక్ బస్టర్ల హిస్టరీ ఉంది. బృందావనం – జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్లలో తారక్ సరసన సమంత నటించింది. అలాగే రభస- రామయ్యా వస్తావయ్యా లాంటి ఫ్లాపులు ఈ జోడీకి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఐదోసారి కలిసి నటించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సమంత అధికారికంగా సంతకం చేసాకే ప్రకటన వెలువడుతుంది. అప్పటివరకూ ఇది ఇంకా సస్పెన్స్ లో ఉనట్టేనని భావించాలి.
సమంత కెరీర్ పరంగా ఇప్పుడు చాలా బిజీగా ఉంది. శాకుంతలం- యశోద చిత్రాలతో పాటు తదుపరి రాజ్ అండ్ డీకే తో ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. అలాగే హాలీవుడ్ లోనూ అడుగుపెడుతోంది. అటు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన అవకాశం అందుకుందన్న గుసగుస వినిపిస్తోంది. ఇంత బిజీ షెడ్యూళ్ల నడుమ తారక్ కోసం ఓకే చెబుతుందా లేదా వేచి చూడాలి.