ఓటీటీ వేదికలు అందరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత భాషతో సంబంధం లేకుండా నటీనటులు పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో నేషనల్ వైడ్ ఫేమస్ అయిన ఏకైక హీరో ఫహాద్ ఫాజిల్ అని చెప్పవచ్చు. ఓ మాదిరి నేషనల్ ఓటీటీ సూపర్ స్టార్ అనే బిరుదు కూడా ఫహాద్ కి ఇవ్వొచ్చు. మాలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన నేచురల్ స్టార్ ఫహాద్ ఫాజిల్.. లెజెండరీ మలయాళ దర్శకుడు ఫాజిల్ తనయుడనే సంగతి కొద్ది మందికే తెలుగు. అంతేకాదు ‘రాజా రాణి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ నజ్రియా భర్త ఆయన.
ఆహా ఓటీటీలో వచ్చిన ‘ట్రాన్స్’ సినిమాతో ఫహాద్ ఫాజిల్ ఎలాంటి నటుడో ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు తెలిసింది. నజ్రియా తో కలిసి ఫహాద్ నటించిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ తెచ్చుకుంది. అలానే ఇటీవల సాయి పల్లవి తో కలిసి ‘అనుకోని అతిథి’ గా వచ్చి మరోసారి అలరించాడు. ఇప్పటికే ‘సి యూ సూన్’ ‘ఇరుల్’ ‘జోజి’ వంటి చిత్రాలను డైరెక్ట్ ఓటీటీ విధానంలో విడుదల చేసిన ఫహాద్.. ”మాలిక్” అనే మరో చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ కు రెడీ చేశారు. ఈ చిత్రం జూలై 15 నుంచి ఈ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
అయితే ఫహాద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. క్యారక్టర్ నచ్చితే అది కథానాయకుడు అయినా లేదా ప్రతినాయకుడు అయినా నటించడానికి రెడీ అవుతాడు. ఈ క్రమంలో అటు హీరోగా ఇటు విలన్ గా కూడా అవలీలగా నటించేస్తున్నాడు మలయాళ స్టార్. ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేంటంటే.. హీరోగా ఫహాద్ ని చూసిన ఆడియెన్స్.. విలన్ గా కూడా అతన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘మలయన్ కుంజు’ అనే మలయాళ సినిమాలో హీరోగా నటిస్తున్న ఫహాద్.. ‘పుష్ప’ – ‘విక్రమ్’ సినిమాలలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడు.
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాతో ఫహాద్ ఫాజిల్ టాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు మెయిల్ విలన్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో ఫాహాద్ పాల్గొంటున్నాడని సమాచారం. ఇదే క్రమంలో కమల్ హాసన్ – లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందుతున్న ‘విక్రమ్’ చిత్రంలో విలన్ గా నటించడానికి విలక్షణ నటుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో మక్కల్ సెల్వన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఏదేమైనా ఒకేసారి అటు హీరోగా ఇటు విలన్ గా రాణిస్తున్న అతి తక్కువ మంది నటులలో ఫహాద్ ఉన్నారనే చెప్పాలి. బాలీవుడ్ లో నజీర్ సిద్ధఖీ కూడా ఇదే తరహాలో మెప్పిస్తుంటారు. ఇక తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా వీరి బాటలోనే అటు విలన్ గా ఇటు హీరోగా రాణిస్తున్నారు. ‘మాస్టర్’ సినిమాలో విలన్ గా కనిపించిన సేతుపతి.. తెలుగు ‘ఉప్పెన’ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ ప్లే చేసాడు. ప్రస్తుతం అర డజను చిత్రాల్లో హీరోగా నటిస్తున్న మక్కల్ సెల్వన్.. ‘విక్రమ్’ సినిమాలో ఒక విలన్ గా కనిపించడానికి సిద్ధం అయ్యారు.
టాలీవుడ్ స్టార్ హీరోల్లో రానా దగ్గుబాటి ‘బాహుబలి’ సినిమాలో విలన్ గా మెప్పించాడు కానీ.. ఎందుకో ఆ తర్వాత అలాంటి పాత్రల జోలికి వెళ్లలేదు. యువ హీరో కార్తికేయ కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. ఇప్పుడు ‘నాని గ్యాంగ్ లీడర్’ చిత్రంలో నెగిటివ్ క్యారక్టర్ చేసిన ‘Rx 100’ హీరో.. ప్రస్తుతం అజిత్ హీరోగా రూపొందుతున్న ‘వాలిమై’ సినిమాలో విలన్ రోల్ లో కనిపించనున్నాడు. మరి కార్తికేయ అటు హీరోగా ఇటు విలన్ గా కొనసాగుతారో లేదో చూడాలి.