పళనిస్వామిని స్టాలిన్ చెప్పుతో పోల్చిన రాజా

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ పార్టీలపై మాటలయుద్ధం మరింత ఎక్కువవుతోంది. ఒకరిపై ఒకరు వాగ్బాణాలు, విమర్శలు సంధించుకుంటున్నారు. తాజాగా ముఖ్యమంత్రి పళనిస్వామిపై డీఎంకే నేత రాజా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం పళనిస్వామిని డీఎంకే అధినేత స్టాలిన్ చెప్పుతో పోల్చారు. ఈ వ్యాఖ్యలు తమిళనాట పెను దుమారం రేపుతున్నాయి.

‘ఒకప్పుడు బెల్లం మార్కెట్ లో కూలీగా పనిచేసిన పళనిస్వామికి స్టాలిన్ తో పోటీయా? పళని కంటే స్టాలిన్ వేసుకునే చెప్పు విలువ ఎక్కువ. అలాంటిది ఆయనకు స్టాలిన్ నే సవాల్ చేసే ధైర్యం ఉందా? నెహ్రూ, ఇందిరాగాంధీ, మోదీ సైతం చేయలేని సాహసాన్ని పళని చేస్తున్నారంటే అందుకు కారణం డబ్బు. రాష్ట్రాన్ని లూటీ చేసిన ఆయనను పార్టీ రక్షిస్తుందని భావిస్తున్నారు. అలాంటి వ్యక్తి స్టాలిన్ ను అడ్డుకుంటాను అంటున్నారు. అదే జరిగితే సీఎం వాహనం ఆయన నివాసం నుంచి కార్యాలయానికి కూడా వెళ్లదు’ అని రాజా వ్యాఖ్యానించారు.

వీటిపై పళని స్పందించారు. తాను పేద రైతునని, పేద కుటుంబం నుంచి వచ్చానని, అందుకే వినయంగా ఉంటానని పేర్కొన్నారు. ‘నేను కష్టపడి సీఎం స్థాయికి వచ్చాను. కానీ స్టాలిన్ తండ్రి సీఎంగా ఉన్నందున ఆయన సిల్వర్ స్పూన్ తో పుట్టారు. నా విలువ స్టాలిన్ ధరించే చెప్పు కంటే తక్కువని పొగరుగా మాట్లాడుతున్నారు. నేను ఒక రైతును. మా పేదలు అలాగే ఉంటారు. మేం కష్టపడి పనిచేస్తాం.. కొనుక్కోగలిగింది మాత్రమే కొనుక్కుంటాం. కానీ వారు రూ.1.76 లక్షల కోట్ల 2జీ స్పెక్ట్రం కుంభకోణం వెనుక ఉన్నారు. కాబట్టి కోరుకుంది కొనుక్కుంటారు’ అని పళని చురకలంటించారు.